Share News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగర అభివృద్ధి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:14 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తుందని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. 1,2 డివిజన్‌ పరిధిలోని చంద్రపురికాలనీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగర అభివృద్ధి

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తుందని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. 1,2 డివిజన్‌ పరిధిలోని చంద్రపురికాలనీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రత, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం, డ్రైనేజీల్లోని సిల్ట్‌ను తీయడం వంటి పనులు చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజలు, పాలకవర్గసభ్యుల సహకారంతో విజయవంతం చేస్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమృత్‌-2 ద్వారా 147 కోట్లతో విలీన గ్రామాల డివిజన్లలో పైప్‌లైన్‌ అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవసరమైన చోట రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పారు.కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ అన్ని డివిజన్లను పరిశుభ్రం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదనంగా డివిజన్‌కు 50 మంది కార్మికులను నియమించుకుని ప్రతిరోజు ఐదు డివిజన్లలో పనులను ముమ్మరంగా చేపడతామని చెప్పారు. జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఎంఏ షాహిద్‌ మసూద్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, కార్పొరేటర్లు అపర్ణ జితేందర్‌, సాదవేని లావణ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:14 AM