Share News

నగరంలో సిటీ బస్సులు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:37 AM

కరీంనగర్‌లో సిటీ బస్సులు తిరగనున్నాయి. గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిటీ బస్సులను ప్రారంభించనున్నారు.

 నగరంలో సిటీ బస్సులు
డిపోలో సిద్ధంగా ఉన్న సిటి బస్సు

భగత్‌నగర్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో సిటీ బస్సులు తిరగనున్నాయి. గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిటీ బస్సులను ప్రారంభించనున్నారు. కరీంనగర్‌ విస్తీర్ణం పెరిగిపోవడం, కరీంనగర్‌ నగరపాలక సంస్థలో శివారు ప్రాంతాల్లోని గ్రామాలు, ఒక మున్సిపాలిటీ విలీనం కావడంతో సిటీ బస్సుల ఆవశ్యకత పెరిగిపోయింది. కరంనగర్‌లో విద్యా వైద్యం, ఉద్యోగ, ఉపాధి కోసం చుట్టు పక్కల ప్రాంతాల నుండి నిత్యం వేలాదిగా ప్రజలు తరలి వస్తుండడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారికి అనువుగా సిటీ బస్సులు మారనున్నాయి. కరీంనగర్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో మూడు వైద్య కళాశాలలతో పాటు, విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి.

ఫ మూడు రూట్లు... మూడు బస్సులు

కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి మూడు రూట్లలో మూడు బస్సులను తిప్పడానికి అధికారులు నిర్ణయించారు. కరీంనగర్‌ పాలక సంస్థలో విలీనమైన గ్రామాలను కలుపుతూ సిటీ బస్సులను నడిపించడానికి అధికారులు రూట్‌ సర్వే పూర్తి చేశారు. కరీంనగర్‌-చింకుంట, కరీంనగర్‌-కొత్తపల్లి (హవేలి), కరీంనగర్‌- వాగేశ్వరి కళాశాల వరకు మూడు రూట్లలో బస్సులను నడిపించనున్నారు. మొదట ప్రధాన మార్గాల్లో సిటీ బస్సులను నడిపించి డిమాం డ్‌ను బట్టి బస్సు సంఖ్య పెంచనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి మూడు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కరీంనగర్‌-2 డిపోకు వచ్చాయి.

ఫ గతంలో ప్రారంభించినా కనిపించని స్పందన

గతంలో సిటీ బస్సులను ప్రారంభించినా ప్రజాదరణ లేకపోవడంతో రద్దయ్యాయి. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద కరీంనగర్‌-1 డిపోకు మొదటి విడతగా 17 సిటీ బస్సులను 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి అదరణ లేక ఆశించన మేర ఆదాయం రాక రద్దు చేశారు. అంతకు ముందు పద్మనగర్‌-ఎల్‌ఎండి కాలనీ వరకు ఒక సిటీ బస్సు నడిపించి రద్దు చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం పెరిగిపోవడంతో నగరపాలక సంస్థలో గ్రామాల విలీనం, ఒక మున్సిపాలిటీ విలీనం కావడంతో ప్రస్తుం విజయవంతమవుతాయని ఆశిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:37 AM