బాలల భద్రతే సమాజ బాధ్యత..
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:36 PM
చిన్నారులకు సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ అన్నారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‘లో భాగంగా ధన్గర్‌వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో చట్టం బాలల రక్షణ కోసం రూపొందించారని వివరించారు. బాలలపై నేరం జరిగినట్లు తెలిసినా, అనుమానం కలిగినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. పిల్లలు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, వేధింపుల గురించి భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పెద్దలకు చెప్పాలన్నారు. చట్టాలపై అవగాహనతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించినప్పుడే బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించగలమని, ప్రతి చిన్నారి హక్కులను గౌరవిస్తూ వారి రక్షణకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ, సభ్యులు, న్యాయవాది కిరణ్‌కుమార్, టూ టౌన్ ఎస్‌ఐ నరేష్‌రెడ్డి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఎలుగు తన్మయి, మర్రి భావన, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమోద, పాఠశాల చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీలత పాల్గొన్నారు.