Share News

బాలల హక్కులను కాపాడాలి..

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:31 AM

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు.

బాలల హక్కులను కాపాడాలి..

తంగళ్లపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్‌ గ్రామం బాల్యవివాహ రహిత గ్రామంగా గుర్తింపు దక్కింది. బుధవారం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅఽథితిగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రశంసాపత్రంతో పాటు డిక్లరేషన్‌ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి బాల్య వివాహ రహిత గ్రామంగా అంకుసాపూర్‌ ఎంపికై ఆదర్శంగా నిలిచిందన్నారు. బాలల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలతో అనేక సమస్యలు అనారోగ్యం, బాలల భవిష్యత్తు అంఽధకారం అవుతుందని తల్లిదండ్రులు గమనించాలన్నారు. బాలికలకు ప్రతి విషయంలో ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయవద్దని, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. పిల్లలను సెల్‌ఫోన్లకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలన్నారు. బాలలందరు పాఠశాలల్లోనే ఉండాలని డ్రాప్‌అవుట్‌ లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు అన్ని ఉచితంగా అందుతున్నాయని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని, అలాగే బాల్య వివాహ రహిత గ్రామంగా ఎంపికైన అంకుసాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను చైల్డ్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని సూచించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే దిశగా కలెక్టర్‌ చేపడుతున్న చర్యలను కొనియాడారు. బాలల హక్కులు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన మోసాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీపీవో జయశీల, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ అంజయ్య, ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎంపీడీవో రమేష్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంఈవో రాజు, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు ఉపేంద్రచారి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:31 AM