Share News

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2026 | 12:33 AM

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యమని.. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని... డ్రగ్స్‌ రహిత తెలంగాణ ఏర్పాటు చేయడం సీఎం రేవంతరెడ్డి సర్కారు లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు.

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

జగిత్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యమని.. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని... డ్రగ్స్‌ రహిత తెలంగాణ ఏర్పాటు చేయడం సీఎం రేవంతరెడ్డి సర్కారు లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం మే డే వేడుకలతో పాటు బాల భరోసా కార్యక్రమం, నశముక్త్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన, డైరెక్టర్‌ అనిత హాజరయ్యారు. సమీకృత కలెక్టరేట్‌లో ఉద్యోగుల చిన్న పిల్లల కోసం క్రెష్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌టీసీ డిపో వద్ద జరిగిన మే డే వేడుకల్లో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొని కార్మిక పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడారు. బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులను వివిధ రకాల పరీక్షలు చేసి లోపాలు ఉంటే చికిత్స అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచి పనిచేస్తుందని అన్నారు. జిల్లాలో టామ్‌కాం ద్వారా శిక్షణను అందించి జగిత్యాల ప్రాంత యువత విదేశాల్లో ఉద్యోగాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు. నషా ముక్త్‌ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చడానికి పోలీసులు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా సమీకృత కలెక్టరేట్‌లో మహిళ సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల స్టాల్స్‌లను ఏర్పాటు చేయగా మంత్రిలక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పరిశీలించారు. పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, స్కూటీలు, ఈ-ఆటో రిక్షాలను అందజేశారు.

ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు

- ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌

ముఖ్యమంత్రి రేవంత రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు. బాల భరోసా పథకం ద్వారా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామస్థాయిలో అంగనవాడీ కేంద్రాలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో సేవలు అందించడం ద్వారా ప్రతి చిన్నారికి నాణ్యమైన ఆరోగ్య సేవలు చేరుతాయన్నారు.

రూ. 50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు..

- రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన

దివ్యాంగులకు పరికరాల కొనుగోలుకు రూ. 50 కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన అన్నారు. ఇందులో జగిత్యాల జిల్లాకు రూ. కోటి పైగా కేటాయించినట్లు వివరించారు. పలువురు యువతులు ఆనలైన మోసాల భారిన పడి సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తుల చేతిలో మోసపోతున్నారని అన్నారు. తెలంగాణలో ఇటీవల పెరిగిన టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు ఆందోళన కలిగిస్తున్నాయని యువతులు ఆన్లైన మోసాల బారిన పడకుండ జీవిత లక్ష్యాల వైపు దృష్టి మళ్లించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ మాట్లాడుతూ పిల్లలకు వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల వారు భవిష్యత్తులో దివ్యాంగులుగా మారే అవకాశం ఉండదన్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన పిల్లలకు తొలిసారిగా జగిత్యాలలో మెడికల్‌ ట్రీట్మెంట్‌ జగిత్యాల నుంచి ప్రారంభిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌, డీఎంహెచవో సుజాత, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్‌కుమార్‌, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:33 AM