బాల్య వివాహాలను అరికట్టాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:20 AM
బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు.
చందుర్తి మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు. చందుర్తి మండలంలోని సనుగుల గ్రామంలోని గంగిరెద్దుల కాలనీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల పరిరక్షణపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. సంచార జీవనం గడపవద్దని, పిల్లలతో బిక్షటన చేయించవద్దని, పాఠశాలకు పంపించి విద్యను అందించాలన్నారు. ఆధార్‌కార్డులు బర్త్ సర్టిఫికెట్ లేని చిన్నారులకు ఆధార్ కార్డులు ఇప్పించాలని అధికారులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తుందన్నారు. గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సర్పంచ్ బొడిగె లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీవో సుచరిత, ఎంపీడీవో రాధ, డీసీపీవో కవిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముఖేష్, పంచాయతీ కార్యదర్శి, పాటు పలువురు పాల్గొన్నారు.