ఇసుక అక్రమ రవాణాకు చెక్
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:39 AM
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకవచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకవచ్చింది. ఎక్కడికక్కడ ఇసుక రవాణా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరుల్లో ఒకటిగా ఉన్న ఇసుక అక్రమ రవాణాను నిలిపివేస్తే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. సాధారణంగా నదులు, పెద్ద పెద్ద వాగుల నుంచి వచ్చే ఇసుకను కమర్షియల్ అవస రాలకు విక్రయిస్తుంటారు. ఆ ఇసుకను విక్రయించేం దుకు టీఎస్‌ఎండీ ద్వారా ఇసుక రీచులను ఏర్పాటు చేసి టన్నుకు 375 రూపాయల చొప్పున విక్రయిస్తు న్నారు. అలాగే స్థానికంగా ఉండే వాగులు, చిన్న చిన్న నదుల నుంచి స్థానిక అవసరాల కోసం ‘మన ఇసుక.. మన వాహనం’ ద్వారా ఇసుకను టన్నుకు 55 రూపా యల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇప్పటి వరకు కేవలం గనులు, భూగర్భ శాఖాధికారులు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అప్పుడప్పుడు పోలీ సుల తనిఖీల్లో పట్టుబడే ఇసుక లారీలు, ట్రాక్టర్లను గనులు, భూగర్భ శాఖకు అప్పగిస్తే వాటికి జరిమానాలు విధిస్తున్నారు. పట్టబడిన ఇసుకను వేలం ద్వారా విక్ర యించే వాళ్లు. అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుక వచ్చింది.
ఫ అధికారులతో పర్యవేక్షణ కమిటీలు..
ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కొత్త పాలసీ తీసుకవచ్చింది. గురువారం ప్రభుత్వం మెమో నంబర్ 280/ఎం(1)/2026 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్‌టీఏ, పంచా యతీరాజ్ అధికారులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. ఆయా ఇసుక రీచులకు సమీపంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. వచ్చే పోయే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను తనిఖీ చేయాల న్నారు. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, వే బిల్లులు ఉన్నాయా, లేదా, వే బిల్లులకు మించి ఇసుకను తీసుకపోతున్నారా, తదితర విషయాలపై ఆరా తీయాల్సి ఉంటుంది. ఇసుక అక్రమ రవాణా గురించి క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలు సమాచారం ఇచ్చేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగం కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలని, ఇది 24 గంటల పాటు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ఇసుక రీచుల నుంచి ఇసుక రవాణా చేసేందుకు కలెక్టర్‌లు సమయాన్ని నిర్ధేశించాలని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఎక్కువగా ఇసుక రవాణా జరగకుండా చూడాల న్నారు. ఇసుక తరలించే వాహనాల వెంబడి వే బిల్లులు ఉన్నాయా, లేదా అని చూడాలన్నారు. ఇసుక వాహనా లను పోలీసు శాఖాధికారులు రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని నిర్ధేశించారు.
ఫ డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు..
అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని, ఇసుక తరలించే వాహ నాలకు జీపీఆర్‌ఎస్ పరికరాలు అమర్చుకునేలా చేయా లన్నారు. పలుసార్లు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడే వారిపై పీడీ చట్టం (ప్రివేన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్టు) కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఇసుక రవాణా చేస్తూ పట్టుబడే వారిని ముందుగా తహసీల్దార్ల ఎదుట సీఆర్‌పీ సెక్షన్ 107 ద్వారా బైండోవర్ చేసి జరిమానా విధించనున్నారు. ఇసుక రీచుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలకు కలెక్టర్లు అనుమతులు ఇవ్వవద్దని పేర్కొన్నారు. జిల్లాలో టీఎస్‌ఎండీసీ ఇసుక రీచులు నడవడం లేదు. జిల్లాలో స్యాండ్ ట్యాక్సీ ద్వారా గతంలో ఇసుకను స్థానిక అవసరాలకు రవాణా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ఎమ్మెల్యేలు మానేరు, గోదావరి నదుల ద్వారా స్థానిక అవసరాలకు ఎలాంటి వే బిల్లులు, ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఉచితంగా ఇసుక తీసుక పోయే విధంగా స్యాండ్ ట్యాక్సీ అమలును నిలిపి వేశారు. దీంతో ఇసుకను విక్రయిస్తున్న ట్రాక్టర్ల యజమానులు ఇసుక సరఫరా చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు ఇసుక అక్రమంగా తీసుకవచ్చి డంపు లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు ఇసుకను తరలించే వారికి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇసుక సరఫరా వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావడం లేదు.