అనర్హులకు చెక్
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:13 AM
ఆహార భద్రతకార్డుల్లో అనర్హులను ఏరివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
జగిత్యాల, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఆహార భద్రతకార్డుల్లో అనర్హులను ఏరివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గతంలో జారీ అయిన రేషన్‌కార్డుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పలు జిల్లాల్లో నకిలీ కార్డులు, ఆరు నెలలుగా రేషన్ సరుకు తీసుకోని వ్యక్తులను అనుమానితులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించింది. జాబితాను దాన్ని ఇటీవల జిల్లాలోని రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులకు ప్రభుత్వం పంపింది. జాబితాపై జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అధికారులు విచారణ చేపట్టి, కార్డుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 30 శాతం విచారణను అధికారులు పూర్తి చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించే పనిలో ఉన్నారు. ప్రక్రియ పూర్తయ్యాక జాబితాలోని అనర్హుల రేషన్ కార్డులను తొలగించే అవకాశాలున్నాయి. కొంతకాలంగా రేషన్ తీసుకోకపోవడం, రెండుచోట్ల కార్డు కలిగి యుండడం, 18ఏళ్ల లోపు వయసున్న కార్డు యజమానులు ఉండడం, నకిలీ ఆధార్‌తో ఉన్న కార్డులు, చనిపోయి చాలా రోజులు గడుస్తున్నా జాబితాలోంచి తొలగించకపోవడం వంటి కారణాలతో వేలాది కార్డులను అనుమానాస్పద జాబితాలో చేర్చారు.
ఫజిల్లాలో 3,52,072 రేషన్ కార్డులు..
జిల్లా వ్యాప్తంగా సుమారు 2,52,072 వివిధ రేషన్ కార్డులున్నాయి. ఇందులో 10,27,397 మంది సభ్యులున్నారు. కాగా జిల్లాలో ఆహార భద్రతా కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 3,37,376 కార్డులుండగా 9,91,888 మంది సభ్యులున్నారు. ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 14,572 ఉండగా 35,367 మంది సభ్యులున్నారు. 124 ఏఏపీ కార్డులుండగా ఇందులో 142 మంది సభ్యులున్నారు. వీరిలో అనర్హులను గుర్తించి రేషన్‌కార్డులను ఏరివేయ డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో సివిల్ సప్లయి, రెవెన్యూ అధికారులతో పరిశీలన చేయిస్తున్నాయి.
ఫఅనుమానిత జాబితాపై విచారణ
జిల్లాని వివిధ మండలాల్లో 9,277 రేషన్ కార్డులలో సుమారు 30 వేల మంది అనుమానిత లబ్ధిదారులతో ప్రభుత్వం జాబితా రూపొందించింది. అనుమానిత లబ్ధిదారుల జాబితాను జిల్లా అధికారులకు పంపింది. ఈమేరకు జిల్లాలో సివిల్ సప్లయి, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 3 వేల కార్డులలో అనర్హులైన లబ్ధిదారులున్నట్లుగా అధికారులు విచారణలో తేల్చారు. కాగా జగిత్యాలలో 2007 కార్డులు, బీర్‌పూర్‌లో 137, మల్యాలలో 354, మల్లాపూర్‌లో 357, వెల్గటూరులో 166, ఇబ్రహీంపట్నంలో 324, కొడిమ్యాల 368, బుగ్గారంలో 102, గొల్లపల్లిలో 285, జగిత్యాల రూరల్ మండలంలో 370, పెగడపల్లిలో 322, ఎండపల్లిలో 153, బీమారంలో 122, సారంగపూర్‌లో 104, కోరుట్లలో 1,681, మేడిపల్లిలో 190, రాయికల్‌లో 440, కథలాపూర్‌లో 305, ధర్మపురిలో 341, మెట్‌పల్లిలో 1,149 కార్డులు అనుమానితంగా అధికారులు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నిజానిజాలు తేల్చనున్నారు.
ఫనివేదికల తయారీ..
సుమారు పక్షం రోజుల క్రితం వచ్చిన అనుమానాస్పద రేషన్ కార్డుల జాబితాను సివిల్ సప్లయి శాఖ అధికారులు తహసీల్ధార్లకు పంపించారు. వారు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. విచారణ నివేదకలను సైతం చాలా మంది తహసీల్ధార్లు ఇప్పటికే సివిల్ సప్లయి శాఖకు పంపించారు. మరికొన్ని మున్సిపాలిటీలు, మండలాల నుంచి నివేధికలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. మండలాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి రాష్ట్రానికి నివేధికలను పంపి కేంద్రానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత అనర్హులుగా గుర్తించిన కార్డులను గానీ, కార్డులలో సభ్యులను గానీ తొలగించే అవకాశాలున్నాయి. ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత వెబ్‌సైట్‌లోని లాగిన్‌లో పూర్తి చేస్తున్నారు. నివేదికలు ప్రభుత్వానికి చేరిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో సదరు రేషన్ కార్డు దారుల్లో, అందులోని లబ్ధిదారుల్లో గుబులు రేగుతోంది.
విచారణ చేస్తున్నాం
-జితేందర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లయి అధికారి
ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమానిత రేషన్‌కార్డులు, లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో సివిల్ సప్లయి, రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయితే ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.