ఉప సర్పంచ్‌లకు చెక్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:16 AM
గ్రామ పంచాయతీల చెక్ పవర్ విషయంలో ఉప సర్పంచ్‌లకు తంటా వచ్చి పడింది. వివిధ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర నిత్యావసర సేవలకు సంబంధించిన బిల్లుల లేకుండా చర్యలు చేపట్టింది.
జగిత్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల చెక్ పవర్ విషయంలో ఉప సర్పంచ్‌లకు తంటా వచ్చి పడింది. వివిధ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర నిత్యావసర సేవలకు సంబంధించిన బిల్లుల లేకుండా చర్యలు చేపట్టింది. సర్పంచ్ లేదా పంచాయతీ కార్యదర్శి చెక్‌ను సమర్పించిన తర్వాత ఏడు పనిదినాల్లో ఉప సర్పంచ్ సంతకం చేయాల్సిందే. లేకపోతే అందుకు సహేతుకమైన కారణం చూపాల్సి ఉంటుంది. కారణం లేకుండా చెక్‌పై సంతకం చేయకుండా నిధుల చెల్లింపులను అడ్డుకుంటే కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఫవిభేదాలు, కొర్రీలతో నిలిచిపోతున్న బిల్లులు..
జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అవసరాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఉప సర్పంచ్‌లు విభేదాలు, కొర్రీలు పెడుతున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి వస్తున్నాయి. ప్రధానంగా సర్పంచ్ ఒక రాజకీయ వర్గానికి, ఉప సర్పంచ్ మరో రాజకీయ వర్గానికి చెందిన చోట్ల బిల్లుల చెల్లింపుల విషయంలో విభేదాలు తలెత్తుతున్న సందర్భాలు ఉంటున్నాయి. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సమన్వయంతో వ్యవహరిస్తుండగా మరికొన్ని చోట్ల ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పంచాయతీ నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుల విషయంలో అభ్యంతరాలు, కొర్రీలు కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి.
ఫపాలన సవ్యంగా సాగేలా..
పంచాయతీల్లో నిధుల చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పారిశుధ్యం, తాగునీటి సరఫరా నిర్వహణ, అబివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి చెక్కులపై సంతకాల విషయంలో అనవసర జాప్యం చేస్తే విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఉప సర్పంచ్‌లపై బాధ్యత పెరగనుంది. గ్రామ పంచాయతీల్లో రాజకీయ విభేదాలు, వ్యక్తిగత వివాదాల కారణంగా ప్రజా అవసరాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోకుండా ఈ ఆదేశాలు అమలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.
ఫకావాలని అడ్డుకోవద్దు..
ఉప సర్పంచ్ చెక్‌పై సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ స్పందించింది. చెక్కు సమర్పించిన ఏడు పని దినాల్లోగా సంతకం చేయకపోతే కారణం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఉప సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా చెల్లింపులను అడ్డుకున్నట్లు కలెక్టర్ విచారణలో తేలితే పంచాయతీ రాజ్‌చట్టం-2018, 2025 సవరణ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఉప సర్పంచ్‌కు ఉన్న చెక్ డ్రాయింగ్ అధికారాన్ని ఉపసంహరించి కార్యదర్శి, ఎంపీఈఓ, ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్ వంటి చట్టబద్ధమైన అధికారులకు అప్పగిస్తారు.