Share News

మారుతున్న జీవన ప్రమాణాలు..

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:13 AM

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనప్రమాణాలు వేగంగా మారుతున్నాయి.

మారుతున్న జీవన ప్రమాణాలు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రస్తుత కాలంలో ప్రజల జీవనప్రమాణాలు వేగంగా మారుతున్నాయి. పెరుగుతున్న సాంకేతిక మనుషుల్లో బద్దకానికి దారితీస్తూ సుఖ జీవనానినిక అలవాటు పడుతున్నారు. తద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా జనాభాలో 46శాతం మంది పురుషులు మద్యానికి అల వాటు కావడం ఆందోళన కలిగిస్తోంది. రక్తపోటు(బీపీ) బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య గతంలో కంటే పురుషులు, మహిళల్లో పెరగడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ప్రసవాల విషయానికి వస్తే ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నప్పటికీ, 76.1శాతం సిజేరియన్లు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరగడం ప్రభుత్వపరంగా అందిస్తున్న వైద్యసేవలు మెరుగ్గా ఉన్నాయనేందుకు సూచికగా కనిపిస్తున్నది. ప్రజలజీవన శైలి, ఆరోగ్యస్థితిగతులు, అలవాట్లు, పొదుపుచర్యలు, ఇంటర్‌నెట్‌ వినియోగం, మహిళల హైజెనిక్‌, తదితర అంశాలపై ప్రతి మూడేళ్లకో సారి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా 2023-24 సంవత్సరంలో 23 మే నుంచి 2024డిసెంబర్‌ వరకు దేశంలోని 715జిల్లాల్లో సర్వే నిర్వహించారు. జిల్లాలో 852ఇళ్లల్లో 708 మంది మహిళలు, 116మంది, మొత్తం 924మందితో సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల 2019-21 సర్వేఫలితాలతో పోలుస్తూ ప్రభుత్వం విడుదలచేసింది. జిల్లాలో మద్యం, పొగాకు విని యోగం, మధుమేహం, రక్తపోటు వంటి అంశాలతోపాటు ప్రసవాల తీరుపైనా సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఫ మద్యం వైపు సగం మంది..

జిల్లాలో 15ఏళ్ల వయసుకు పైబడిన వారిలో మహిళల కంటే పురుషుల్లో మద్యం వినియోగం గణనీయంగా ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు 5.1శాతం మంది మద్యం సేవిస్తుండగా, పురుషులు 46.0శాతం సేవిస్తున్నారు. గత సర్వే కంటే మద్యం సేవించే మహిళల శాతం 0.9పెరగడం గమనార్హం. కానీ ఈ సర్వే అనంతరం గడిచిన ఏడాదిలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగినట్లుగా కనబడుతున్నది. పొగాకు వినియోగించే వారిలో మహిళలు 3.8శాతం, పురుషులు 16.4శాతం వినియోగిస్తున్నారు. ఇది గతంలో కంటే వినియోగం తగ్గడం శుభపరిణామం. అయితే లెక్కల ప్రకారం మద్యం, పొగాకు వినియోగాన్ని పరిశీలిస్తే కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి.

ఫ పెరుగుతున్న షుగర్‌ బాధితులు..

ప్రజల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం ప్రభావం చూపుతున్నట్లుగా మధుమేహానికి సంబంధించిన గణాంకాలు సూచిస్తున్నాయి. గత సర్వేతో పోల్చితే షుగర్‌ బాధితుల శాతం పెరిగింది. షుగర్‌ కోసం మందులు వినియోగిస్తున్న మహిళల్లో 18.2శాతం ఉండగా, గతంలో కంటే 4.5శాతం పెరిగారు. పురుషుల్లో 21.9శాతం ఉండగా, గతంలో కంటే 5.1 శాతం పెరిగారు. పట్టణప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ షుగర్‌ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మధుమేహానికి భిన్నంగా రక్తపోటు బాధితుల శాతంలో కొంత తగ్గుదల నమోదైంది. మందులు వాడుతున్న పురుషులు 30.5శాతం ఉండగా, మహిళలు 24.5శాతం ఉన్నారు. ఇది షుగర్‌ వ్యాధిగ్రస్తులతో పోలిస్తే సంఖ్య ఎక్కువే. కానీ గతంతో పోలిస్తే రక్తపోటు వ్యాధిగ్రస్తులు తగ్గుముఖం పట్టారు.

ఫ పెరుగుతున్న వృద్ధులు..

జిల్లా జనాభాను పరిశీలించినట్లయితే ఐదేళ్లలోపు చిన్నారులు 5.8శాతం ఉండగా, గతంలో 6 శాతం ఉన్నారు. 15ఏళ్లలోపు 17.3శాతం, గతంలో 18.1శాతం ఉన్నారు. 60ఏళ్ల వాళ్లు 15.8శాతం ఉండగా, గతంలో 13.9శాతంమంది ఉన్నారు. గతంలో కంటే వీరిసంఖ్య 1.7శాతం పెరగగా, చిన్నారుల సంఖ్య తగ్గుతున్నది. జననాల రేటు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం, తదితర కారణాలతో రాబోయే రోజుల్లో వృద్ధుల సంరక్షణ కూడా కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

ఫ ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 72.6శాతం ఉండగా, గతంలో 58.2శాతం ఉంది. అంటే 14.2శాతం పెరగడం గమనార్హం. పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ వైద్యసేవలపై ఆధారపడుతున్నారు. అయితే సిజేరియన్లు మాత్రం పెరుగుతున్నాయి. ప్రసవాల్లో 76.1 శాతం సిజేరియన్లే కావడం గమనార్హం. గతంలో 71.6శాతం ఉండగా 4.5శాతం పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల పెంపుపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సర్వే గణాం కాలు సూచిస్తున్నాయి. అలాగే మహిళల్లో పొదుపుచేసే వారిసంఖ్య 90.1శాతానికి పెరిగింది. గతంలో 77.7శాతంగా ఉంది. మొబైల్‌ వాడుతున్న వాళ్లు 68.7శాతం ఉంది. ఇంటర్‌నెట్‌ వాడకం 27శాతం నుంచి 59.2శాతానికి పెరిగింది.

Updated Date - Sep 11 , 2026 | 02:13 AM