Share News

వేములవాడలో మారుతున్న సమీకరణాలు

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:49 AM

వేములవాడ మున్సిపల్‌లోని 28 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.

వేములవాడలో మారుతున్న సమీకరణాలు

వేములవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్ర జ్యోతి): వేములవాడ మున్సిపల్‌లోని 28 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మున్సిపల్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే 14 స్థానాలు గెలుపొందాల్సి ఉండగా, ఎవరికి సరైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ 13 స్థానాలు, బీజేపీ పార్టీ 8 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 5స్థానా లు, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. ఎన్నికల కౌంటింగ్‌ వచ్చిన వెంటనే 21వ వార్డు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన నరాల శేఖర్‌, స్వతంత్రులుగా గెలుపొందిన 19వ వార్డు కుమ్మరి శిరీష, 7వ వార్డు ఐల శ్రీనివాస్‌లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు శుక్రవారం వెల్లడించారు. మున్సిపల్‌ పీఠం దక్కించుకునేందుకు దక్కాల్సిన 14 స్థానాలకు ప్రస్తుతం 13 కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఇద్దరు స్వతంత్రులతో కలిసి మొత్తం 16 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. దీంతో వేములవాడ బల్దీయాపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసేందుకు లైన్‌ క్లియరైనట్లు స్పష్టంగా తెలుస్తుంది.

స్వతంత్రులకు బీజేపీ ఆశలు..

వేములవాడ మున్సిపల్‌ పీఠం ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీకి దక్కకూడదనే ఉద్దేశ్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ తరువాత ఎక్కువగా 8 స్థానాలను బీజేపీ గెలుపొందగా బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్న 4 స్థానాలను కలు పుకుని 12 స్థానాలు బీజేపీ చేతిలో స్పష్టంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్న ఇద్దరు స్వతంత్రులకు చైర్మన్‌ పదవి ఆశ చూపి క్యాంపు నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 4, ఇద్దరు స్వతంత్రులను తీసుకురాగలిగితే 14 మందితో బీజేపీ వేములవాడ మున్సిపల్‌ పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌ క్యాంపులోనే..

వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల రిజల్ట్‌ ఒక్క రోజు ముందుగానే ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ రాజకీయ ముందు చూపుతో కాంగ్రెస్‌ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నరాల శేఖర్‌, స్వతం త్రులు శ్రీనివాస్‌, శిరీషలను కాంగ్రెస్‌ క్యాంపుకు తరలించి దగ్గరుండి మరీ క్యాంపులో వ్యూహాలు రచిస్తున్నాడు. 16 మందితో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి మున్సిపల్‌ ఫీఠం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఓ బీజేపీ కౌన్సిలర్‌, మరో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌ క్యాంపునకు తరలించేందుకు ప్రయ త్నాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వేములవాడ మున్సిపల్‌పై మొదటి సారిగా కాంగ్రెస్‌ జెండా ఎగరవేసేందుకు సిద్దంగా ఉన్నట్లు జోరుగా ప్రచా రం జరుగుతోంది. అయితే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌ను కలుపుకుని ఇద్దరు స్వతంత్రులను తీసుకువచ్చి జెండా ఎగరవేస్తుందా..? లేకా ఒక బీజేపీ, మరో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను వదులుకుని 18 మందితో కలిసి కాంగ్రెస్‌ జెండా ఎగరవేయనుందా సోమవారం వరకు వేచి ఉండాల్సి రావడంతో పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Feb 15 , 2026 | 12:49 AM