Share News

గోమాత వైభవంపై చాగంటి ప్రవచనం

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:42 PM

ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జమ్మికుంటలో భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.

గోమాత వైభవంపై చాగంటి ప్రవచనం
చాగంటి కోటేశ్వర్‌రావుకు స్వాగతం పలుకుతున్న ప్రజలు.

జమ్మికుంట, నవంబరు 02 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జమ్మికుంటలో భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. పట్టణంలోని శివాలయం ఆవరణలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై గోమాత వైభవం, శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమలను వివరిస్తూ ప్రవచనం చేశారు. సనాతన ధర్మంలో గోవుకు ఉన్న విశిష్టత, గోమాతను దైవస్వరూపంగా భావించడానికి గల పురాణ ప్రాధాన్యతను వివరించారు. కామధేనువు వైభవం, గోవుల పవిత్రత, గోసేవ, గోసంరక్షణ ప్రాధాన్యతను తెలియజేశారు. గోవులను కేవలం పశువులుగా కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అంతర్భాగంగా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. గోవు వైభవం సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ధర్మ వర్దిని సంస్థ చిత్రమాలికతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సంస్థ తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాన్ని స్వీకరించిందని వివరించారు. ఆ చిత్రంలో బ్రహ్మదేవుడు ఆవు రూపంలో, పరమశివుడు దూడ రూపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి పుట్టలో ఉండగా ఆవు వచ్చి పాలు విడిచిపెట్టడం, ఆ పాలను స్వామివారు స్వీకరించడం చిత్రంలో కనిపిస్తుందన్నారు.

ఈ క్రమంలో ఆవుపై గొడ్డలితో దాడి చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా, గోమాతను రక్షించేందుకు శ్రీ వేంకటేశ్వర స్వామి పుట్టలో నుంచి బయటకు వచ్చి గొడ్డలి దెబ్బను స్వీకరించిన ఘట్టాన్ని చిత్రమాలికలో అద్భుతంగా చిత్రీకరించినట్లు వివరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారం అత్యంత విశిష్టమైనదని, గోమాత రక్షణ కోసం స్వామివారు దెబ్బను స్వీకరించిన ఈ ఘట్టం గోవుకు ఉన్న ప్రాధాన్యతను చాటుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం, పురాణ గాథలు, భక్తి, సేవ, ధర్మం వంటి విలువలను వివరించారు. ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను నేటి తరానికి అందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచనాలను ఆలకించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మొలుగు ప్రశాంత్‌ కుమార్‌, అన్నపూర్ణ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:42 PM