సర్వైకల్ కాన్సర్‌పై టీకాస్త్రం
ABN , Publish Date - Feb 27 , 2026 | 01:04 AM
మహిళలు రకరకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మహిళలు రకరకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. వీటిలో ప్రధానంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వైకల్) వారిని కబళిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళల్లో క్యాన్సర్లపై అవగాహన కల్పించడం, ప్రతినెల పరీక్షలు చేయడం, అనుమానిత కేసులను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాజాగా సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని నిరోధించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలలోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకాలను అందించడానికి ఏర్పాటు చేశారు. ఈనెల 28 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా బాలికలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రాభంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 14-15 సంవత్సరాల బాలికలను గుర్తించారు. జిల్లాలో 4362 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేయడానికి గుర్తించారు. ఇందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు రక్షణగా టీకా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోస్ టీకా రూ.3 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టీకాను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసింది. టీకా వేయించుకోవాలంటే సెల్‌కు ఓటీపీ లేదా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. టీకా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సర్వైకల్ కాన్సర్ లక్షణాలు..
క్యాన్సర్ బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. గర్భాశయం, బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత సుమారు 15 ఏళ్లకు బయటపడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న మహిళల్లో తొందరగానే అభివృద్ధి చెందుతుంది. సర్వైకల్ క్యాన్సర్లు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉండటం, లైంగిక చర్యల్లో నొప్పి మంటతో పాటు దుర్వాసనతో కూడిన రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, నీరసం, విరోచనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, వంశపారంపర్యంగా కూడా వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కనిపించిన ఆస్పత్రులకు వెళ్లడానికి ఇబ్బంది పడడంతో మహిళ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. సర్వైకల్ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ టీకాతో చెక్ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి సిద్ధం చేశారు. స్పెషల్ డ్రైవ్‌గా మే మాసం వరకు టీకాలు వేయనున్నారు.