జనగణన షురూ
ABN , Publish Date - May 12 , 2026 | 01:08 AM
జిల్లా వ్యాప్తంగా జన గణన ప్రక్రియ మొదలైంది. జనగణనలో భాగంగా మొదటి విడత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం నుంచి చేపట్టారు.
జగిత్యాల, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా జన గణన ప్రక్రియ మొదలైంది. జనగణనలో భాగంగా మొదటి విడత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం నుంచి చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే నాలుగు విడతలుగా సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. 2059 మంది ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లకు వెళ్లి ఇళ్లను లెక్కిస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియ ఆధారంగా 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలను ప్రకటించనున్నారు. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 13 వేల మందికి పైగా తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.
ఫరెండు విడతల్లో..
ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం జనాభాను లెక్కిస్తోంది. కొవిడ్ తదితర కారణాలతో 2021లో చేపట్టాల్సిన ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ప్రస్తుతం చేపడుతున్నారు. జనగణన ప్రక్రియ రెండు విడతల్లో చేపట్టనున్నారు. మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు, తర్వాత జనాభా లెక్కింపు చేయనున్నారు. సోమవారం నుంచి జల్లాలోని ఇళ్లను లెక్కించేందుకు యంత్రాంగం ముందుకు వెళ్తోంది. జూన్ 9వ తేదీ వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. 2011లో నిర్వహించిన లెక్కలు ప్రకారం జిల్లాలో 9,85,417 మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 4,84,079 మంది, మహిళలు 5,01,338 మంది ఉన్నారు. జిల్లాలో 2,53,619 ఇళ్లు ఉన్నాయి.
ఫమండలాల వారీగా శిక్షణ..
జనాభా లెక్కల్లో భాగంగా మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు కోసం 299 మంది సూపర్‌వైజర్లు, 1,755 మంది ఎన్యూమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించారు. వీరికి నాలుగు విడతల్లో మండలాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో మాదిరిగా మాన్యువల్ విధానంలో కాకుండా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా వివరాలను సేకరించనున్నారు. ఈనేపథ్యంలో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పక్కాగా ఉండేలా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ముగిశాయి.
ఫసెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో 16,880 మంది నమోదు
ప్రస్తుతం డిజిటల్ విధానంతో పాటు స్వయంగా ప్రజలే వారి వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26వ తేదీన మొదలు కాగా ఈనెల 10వ తేదీతో ముగిసింది. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 16,880 మంది తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఎన్యుమరేటర్లు ఇళ్ల లెక్కింపుతో పాటు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వివరాలను పరిశీలించనున్నారు.
ఫప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా కలెక్టర్..
జనగణనకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా అడిషనల్ కలెక్టర్ వ్యవహరిస్తారు. డివిజన్లకు ఆర్డీవోలు, సీపీఓ, డీఈవో, డీఏవో, జడ్పీ సీఈవో, డీసీపీవో, ఏడీసీవోలు ఉంటారు. మండలాల్లో ఇన్‌చార్జి ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, ఎంఈవోలు ఉంటారు. మున్సిపలిటీల్లో చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా మున్సిపల్ మేనేజర్లు వ్యవహరిస్తారు.
వనరుల పంపిణీకి జన గణన కీలకం
-సత్యప్రసాద్, కలెక్టర్
దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల పంపిణీకి జన గణన కీలకం కానుంది. జన గణన సందర్భంగా అందరూ తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలకు కచ్చితంగా అందించాలి. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. జిల్లా ప్రజలందరూ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలి.