శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకం
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:43 PM
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, టూవీలర్ నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు.
గన్నేరువరం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, టూవీలర్ నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. మండలం లోని ఖాసింపేటలో ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖాసింపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై లైవ్ మానిటరింగ్ సిస్టింను ఖాసింపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయగా సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకరావడమే లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త సీసీ కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమా ద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలను కాపాడే వారికి ప్రభుత్వం రహవీర్ పథకం కింద రూ. 25 వేల నగదు పురస్కారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. మండ లంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన ఎస్‌ఐ నరేందర్‌రెడ్డిని సీపీ ఘనంగా సన్మానించారు. అనంతరం టూవీలర్ వాహనదారులకు హెల్మెట్ లను, క్రీడాకారులకు క్రీడాకిట్‌లను సీపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, స్థానిక సర్పంచ్ కర్నె చంద్రయ్య, పారువెల్ల సర్పంచ్ యాళ్ల లక్ష్మి, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, యువత పాల్గొన్నారు.