కబ్జా చెర.. కాపాడండి జర
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:45 AM
కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న బొమ్మకల్ పరిధిలోని గోపాల్‌రావుకుంట ఆక్రమణకు గురవుతుందని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు 28.10 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ పెద్దచెరువు ప్రస్తుతం 13.10 ఎకరాలు మాత్రమే ఉందని 15 ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
- కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి సమీపంలోని ఓ చెరువు దుస్థితి ఇది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో మారుతున్న అవసరాల దృష్ట్యా ఈ చిన్ననీటి వనరు కాలక్రమంగా కనుమరుగవుతోంది. హద్దులు చెరిగిపోతూ పరిధి కుచించుకుపోతోంది. నలువైపుల నుంచి ఆక్రమణలు పెరగడంతో ఒకప్పుడు మూడింతల విస్తీర్ణం కాస్త ఇప్పుడు ఒకింతకు మారిపోయింది. ఇదే మాదిరిగానే నగరంలోని పలుప్రాంతాల్లో ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేదని చెప్పుకొనే పరిస్థితి పలు కాలనీల్లో వినిపిస్తోంది.
- కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న బొమ్మకల్ పరిధిలోని గోపాల్‌రావుకుంట ఆక్రమణకు గురవుతుందని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు 28.10 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ పెద్దచెరువు ప్రస్తుతం 13.10 ఎకరాలు మాత్రమే ఉందని 15 ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. కొత్తపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌ను పలువురు రియల్టర్లు మట్టి పోసి ఆక్రమిస్తున్నారని సెప్టెంబర్ 20వ తేదీన కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సర్వే చేయించాలని స్థానికులు కోరారు.
రోజు రోజుకు భూమి అవసరం పెరుగుతుండటం, స్థిరాస్తి వ్యాపారాలు విస్తరిస్తుండంతో విలువైన చెరువులు, కుంటలు ఆక్రమణ చెరలో చిక్కుకుంటున్నాయి. కొందరు వారి అవసరాలే ప్రామాణికంగా అడ్డదార్లు తొక్కుతున్నారు. అందినకాడికి జలవనరుల్ని కబ్జా చేస్తున్నారు. ఏళ్ల తరబడి జలవనరులుగా సేవలందించిన తటాకాలు కాలక్రమంగా వాటి రూపు కోల్పోతున్నాయి. ముఖ్యంగా విస్తరిస్తున్న కరీంనగర్, ఇతర మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల చెరువులు ఆక్రమణల గండంలో చిక్కుకుంటున్నాయి. ఒకప్పుడు పంట పొలాలకు సాగునీరందించిన కుంటలు నేడు వాటి ఉనికి కోల్పోతున్నాయి. తూములు, అలుగులు, చెరువు కట్టల స్థావరాల గుర్తులు చెరిగిపోతున్నాయి.
హద్దులు లేక అన్యాక్రాంతం
కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రాంతాల్లోని చెరువులు కుంటల విస్తీర్ణాలు సగానికిపైగా తగ్గిపోయాయి. తీగలగుట్టపల్లిలో రైల్వేగేట్ దాటిన తర్వాత చొప్పదండి రోడ్డులోని చెరువు చుట్టూర మట్టిని కప్పుతూ ఆక్రమణలు పెరిగాయి. ఇదే విధంగా 13.05 ఎకరాల్లోని మాలకుంట సరిహద్దుల ఆనవాళ్లు కరువయ్యాయి. ఉడతకుంట, అవుసుల కుంట విస్తీర్ణాల జాడ కనమరుగయ్యింది. ముఖ్యంగా బొమ్మకల్‌కు ఆనుకుని రెండు దశాబ్దాల కిందట ఉన్న పెద్దచెరువులు, కుంటల ఆచూకీ ఇప్పుడు కనుక్కోవడం నీటిపారుదల శాఖ అధికారులకే కష్టమయ్యేలా పరిస్థితి మారిపోయింది. బొమ్మకల్ పరిధిలో 46.21 ఎకరాల్లో ఉన్న జక్కప్ప చెరువు, 28.10 ఎకరాల్లో ఉన్న గోపాల్ చెరువు, 16.10 ఎకరాల్లో ఉన్న నల్లచెరువు, 12 ఎకరాల్లో ఉన్న గోదుమకుంట, 9.10 ఎకరాల్లో ఉన్న రావికుంట దాదాపుగా సగానికిపైగా భూభాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేశారు. అలుగునూర్‌లోని మామిడికుంట ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) పరిధిలో పలు భవన నిర్మాణాలు వెలుస్తున్నాయి.
సగానికిపైగా ముప్పు..
జిల్లా వ్యాప్తంగా 1,544 చెరువులు, కుంటలున్నాయి. 13,456.91 హెక్టార్‌లలో ఇవి విస్తరించి ఉన్నట్లు ఇరిగేషన్ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే 2018-19లో జిల్లాలోని అన్ని చెరువుల నీటినిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్) ఉన్న పరిధి హద్దులను గుర్తించగా 141 చెరువులు, కుంటలు ఆక్రమణ చెరలో ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చి ఉన్నతాధికారులకు నివేదించారు. వాటి రక్షణ కోసం అక్కడక్కడ బోర్డులను ఏర్పాటు చేసినా అన్యాకారంతాల పర్వం యథేచ్చగా కొనసాగింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చెరువులు, కుంటల్లో దాదాపుగా సగానికిపైగా కబ్జాకోరల్లో చిక్కుకున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. జియోట్యాగింగ్ ఆధారంగా హద్దులు నిర్ణయించాలని గతంలో భావించినా ఆచరణలో సాధ్యపడలేదు. మరోవైపు చెరువులకు సరిహద్దులను నిర్ణయించి వాటికి కంచెలు వేయాలని భావించి నిధుల అంచనాలను నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించినా సంరక్షణకు సంబంధించి ప్రత్యేక నిధుల జాడ జిల్లాకు రాలేదు. దీంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. జలవనరులకు ఆనుకుని ఉన్న పట్టాదారులతో పాటు ఇతరులు సరిహద్దులను చెరిపేస్తూ క్రమంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. శిఖం స్థలాల్లో షెడ్ల నిర్మాణాలు చేపట్టడం, భవనాల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇక ఊళ్లల్లోని చెరువుల విషయంలో ఉన్న విస్తీర్ణాన్ని ఆక్రమించుకుని పలువురు పంటలు సాగుచేస్తుండటంతో అసలు జాగ కనుమరుగైపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూగర్భజలాల మట్టం పెరగాలన్నా ఉన్న చిన్న వనరుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరముంది. ఈ దిశగా నీటిపారుదల, రెవెన్యూ, బల్దియా అధికారులు దృష్టి సారించి పట్టణాల్లో ఉన్న నీటి వనరులను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.