Share News

ప్రచార హోరు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:56 AM

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రచార హోరు

జగిత్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లోని ప్రతీ వార్డులో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు నువ్వా....నేనా..? అనే తరహాలో తలపడుతున్నాయి. కొన్ని వార్డుల్లో ఈ మూడు పార్టీల మధ్యలోకి స్వతంత్రులు, ఇతర పార్టీలు దూసుకువస్తున్నాయి. కోరుట్ల, జగిత్యాలలో తామే కీలకమవుతామని ఎంఐఎం ధీమాతో ఉంది. ప్రధాన పార్టీలకు తామేం తీసిపోమంటూ బీఎస్పీ, ఆప్‌, జనసేన, సీపీఐ, సీపీఐ (ఎం)తో పాటు రెబల్స్‌, స్వతంత్రులు పోటీ పడుతున్నారు.

ఫజగిత్యాల మున్సిపాలిటీలో...

జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. మూడు పార్టీలు దాదాపు ఆయా వార్డుల్లో అభ్యర్థులను నిలిపాయి. ఈ సారి మైనార్టీలు ఎక్కువగా ఉన్న వార్డుల్లోనూ బీజేపీ అభ్యర్థులను నిలపడం, లేదా మద్దతు పలకడం వంటివి చేస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన పలువురు కౌన్సిలర్లు ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ల అనుచరులు పలువురు బీఫామ్‌లు రాకపోవడంతో రెబల్స్‌గా బరిలో ఉన్నారు. జగిత్యాలలో బీజేపీ 46 వార్డుల్లో, 50 వార్డుల్లో కాంగ్రెస్‌, 8 వార్డుల్లో ఏఎంఐఎం, 49 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 6 వార్డుల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, 1 వార్డులో సీపీఐ, 2 వార్డుల్లో జన సేన పార్టీ, 92 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. జగిత్యాలలో మొత్తంగా 50 వార్డుల్లో 254 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆప్‌ తొలిసారిగా పలు చోట్ల, సీపీఎం, జనసేన పలు చోట్ల పోటీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నా జన సేన ఇక్కడ పోటీ పడుతోంది.

ఫకోరుట్ల బల్దియాలో...

జిల్లాలో రెండో పెద్ద మున్సిపాలిటీ అయిన కోరుట్లపై అందరి దృష్టి ఉంటోంది. ఇక్కడ మొత్తం 33 వార్డులున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, ఏఎంఐఎం, బీఆర్‌ఎస్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ, జనసేన పార్టీ, ఇతర రిజిస్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీలు, వివిధ వార్డుల్లో స్వతంత్రులు పోటీ పడుతున్నారు. మొత్తంగా కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులకు గానూ 150 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ పలు పార్టీలకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు.

ఫమెట్‌పల్లి పుర పాలికలో..

మెట్‌పల్లిలో ప్రధాన రాజకీయ పక్షాలు నువ్వా...నేనా అన్న చందంగా పోటీ పడుతున్నాయి. మెట్‌పల్లిలో 26 వార్డులున్నాయి. 26 వార్డుల్లో కాంగ్రెస్‌, 26 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 26 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఒక వార్డులో ఆప్‌, ఒక వార్డులో బీఎస్‌పీ, 3 వార్డుల్లో ఏఐఎంఐఎం, 2 వార్డుల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, 12 వార్డుల్లో జన సేన పార్టీ, 9 వార్డుల్లో ఇతర రిజిస్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీలు, వివిధ వార్డుల్లో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా మెట్‌పల్లిలో 26 వార్డుల్లో 150 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.

ఫధర్మపురి మున్సిపల్‌లో...

ఆధ్యాత్మిక కేంద్రం, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో 15 వార్డులున్నాయి. ఇక్కడ 15 వార్డుల్లో కాంగ్రెస్‌, 15 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 15 వార్డులో బీజేపీ అభ్యర్థులు, వివిధ వార్డుల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల రంగంలో ఉన్నారు. మొత్తంగా ధర్మపురిలో 15 వార్డులకు గానూ 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఫరాయికల్‌ బల్దియాలో...

రాయికల్‌ మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. ఇక్కడ 12 వార్డుల్లో బీజేపీ, 12 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 11 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరికి తోడు 5 వార్డుల్లో జనసేన పార్టీ, వివిధ వార్డుల్లో 9 మంది స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఒక వార్డులో కాంగ్రెస్‌ బీఫామ్‌ అందుకున్న అభ్యర్థి నామినేషన్‌ను ఉప సంహరించుకోవడంతో సంబంధిత వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో లేకుండా పోయింది.

ఫవార్డుల బాటలో సీనియర్లు...

ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించాలని అధిష్ఠానాలు ఆదేశాలు జారీ చేయడంతో మూడు ప్రధాన పార్టీల సీనియర్లు వార్డుల బాట పట్టారు. జగిత్యాలలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ప్రచారం చేస్తానని ప్రకటించి ముందుకు వెళ్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే సంజయ్‌ వర్గానికి బీఫామ్‌లు అందని పలువురు నేతలు రెబల్స్‌గా పోటీలో ఉండడంతో వారికి సైతం మద్దతు పలుకుతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్‌ బీఫామ్‌లు అందిన దాదాపు 15 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులకు, ఇతర వార్డుల్లో రెబల్స్‌గా ఉన్న తన అనుచరులను గెలిపించడానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, బీజేపీ తరఫున పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ప్రవీణ్‌లు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ప్రచారం సభ నిర్వహించారు.

కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీజేపీకి పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ చిట్నేని రఘు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ యాదగిరి బాబులు ప్రచారం చేస్తున్నారు. ధర్మపురిలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించడంతో పాటు పార్టీలో చేరికలు, ఇతర రాజకీయ పావులను కదుపుతుండడంతో రోజురోజుకు రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Updated Date - Feb 06 , 2026 | 12:56 AM