Share News

పొరుగున సందడి.. ఇక్కడ నిరీక్షణ..

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:26 AM

పొరుగు జిల్లాల్లో చేనేత పోరుతో నేతన్నల్లో సందడి మొదలైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల నేతన్నలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. చేనేత, పవర్‌లూమ్‌ సహకార సంఘాల ఎన్నికల కోసం నేతన్నలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న వేళ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12 ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

పొరుగున సందడి.. ఇక్కడ నిరీక్షణ..

- జిల్లాలో చేనేత ఎన్నికలకు తప్పని ఎదురుచూపులు

- ఇతర జిల్లాల్లో మొదటి విడత సహకార ఎన్నికల నిర్వహణ

- తొలి విడత ఎన్నికలకు నోచుకోని రాజన్న సిరిసిల్ల జిల్లా

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పొరుగు జిల్లాల్లో చేనేత పోరుతో నేతన్నల్లో సందడి మొదలైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల నేతన్నలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. చేనేత, పవర్‌లూమ్‌ సహకార సంఘాల ఎన్నికల కోసం నేతన్నలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న వేళ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12 ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో 50 మంది సభ్యులు ఉన్న చేనేత సహకార సంఘాలకు మొదటి విడత ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఏదైనా కారణాలతో మిగిలిపోయిన వాటికి 15వ తేదీలోపే ఎన్నికలు పూర్తిచేస్తారు. చేతులెత్తే పద్ధతిలో నిర్వహించే ఎన్నికల్లో 50 మందికి పైగా ఉన్న సొసైటీలకు ఈనెల చివరిలోగా ఎన్నికల పూర్తిచేసి పాలకవర్గాలకు బాధ్యతలకు అప్పగించే విధంగా చేనేత జౌళిశాఖ షెడ్యూల్‌ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11 సొసైటీలు ఉండగా ఇందులో ఏడు చేనేత సహకార సొసైటీలు, నాలుగు పవర్‌లూమ్‌ సహకార సంఘాలు ఉన్నాయి. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు చేనేత, జౌళి శాఖ యుద్ధ ప్రాతిపదికన ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 4నుంచి 13వ తేదీ వరకు చేనేత సొసైటీలోని బకాయిదారుల జాబితాలను ప్రచురించారు. 15వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జాబితాలు రూపొందించి డ్రాప్‌ ఓటర్‌ జాబితాను 18 నుంచి 25 వరకు ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించారు. ఏప్రిల్‌ 27,28,29 తేదీల్లో అభ్యంతరాలు పరిశీలించి జాబితాలను సవరించారు. ఏప్రిల్‌ 30, మే 1వ తేదీల్లో ఓటర్‌ జాబితాను చేనేత, జౌళి శాఖ ఏడీకి అందించారు. మే 1 నుంచి 5వ తేదీ వరకు ఓటర్‌ జాబితాలను జిల్లా శాఖ కార్యాలయంలో పరిశీలించి మళ్లీ ఓటర్‌ జాబితాపై 6, 7,8 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించారు. మే 1, 12తేదీలలో ఓటర్‌ జాబితాలను సహకార సంఘాలకు పంపించారు. మే 15 తేదీన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీకి ఎన్నికల నిర్వహణకు పంపించారు. దీని ప్రకారం జూన్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. సంఘాల్లో ఎలాంటి అపులు లేని సభ్యులకు మాత్రమే ఓటు వేసే హక్కును కల్పించింది. కొందరు ఆశావహులు సంఘాల్లో తీసుకున్న రుణాలను సైతం చెల్లించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సహకార సంఘాల్లో 50 మందిలోపే సభ్యులు ఉన్నారు. మొదటి దశలోనే సిరిసిల్లలో ఒకేసారి ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ చేనేత జౌళి శాఖ నుంచి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు రాకపోవడంతో సర్వం సిద్ధం చేసిన అధికారులు ఆదేశాలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాల సభ్యులు మాత్రం ఎన్నికలకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో 11 సొసైటీలు.. 321 మంది ఓటర్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందల సంఖ్యలో ఉన్న చేనేత సహకార సంఘాలు మరమగ్గాల మాటున కనుమరుగయ్యాయి. చివరకు 11 సంఘాలు మిగిలాయి. ఇందులో 7 చేనేత, 4 పవర్‌లూమ్‌ సహకార సంఘాలు మాత్రమే పనిచేస్తున్నాయి. సంఘాల పరిధిలో ఉన్న సభ్యులు బకాయిదారులను ఓటు హక్కు నుంచి తొలగించి తుది జాబితా ప్రకారం 11 సొసైటీలో 321 మంది ఓటర్ల జాబితను వెల్లడించారు. వీరిలో పురుషులు 256 మంది, మహిళా కార్మికులు 65 మంది ఉన్నారు. వేములవాడ సొసైటీలో 36 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 30 మంది, మహిళలు 6 మంది ఉన్నారు. హనుమాజీపేట సొసైటీలో 32 మంది ఉండగా, పురుషులు 25 మంది, మహిళలు 7 మంది, మామిడిపల్లిలో 47మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34 మంది, మహిళలు 13 మంది, సిరిసిల్లలోని మహేశ్వర సొసైటీలో 36 మంది ఉండగా, పురుషులు 32మంది, మహిళలు నలుగురు, జగదాంబ సొసైటీలో18 మంది ఉండగా, పురుషులు 11 మంది, మహిళలు 7 మంది, సిరిసిల్ల సొసైటీలో 37 మంది ఉండగా, పురుషులు 33 మంది, మహిళలు నలుగురు, శ్రీలక్ష్మీ పవర్‌లూమ్‌ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 17 మంది, మహిళలు నలుగురు, భాగ్యలక్ష్మి పవర్‌లూమ్‌ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 13 మంది, మహిళలు 8 మంది, అశోక పవర్‌లూమ్‌ సొసైటీలో 21 మంది ఉండగా, పురుషులు 18 మంది, మహిళలు 5 మంది, సరస్వతి పవర్‌లూమ్‌ సొసైటీలో 22 మంది ఉండగా, పురుషులు 17 మంది, మహిళలు 5 మంది, భద్రావతి చేనేత సొసైటీలో 28 మంది ఉండగా, పురుషులు 26 మంది, మహిళలు ఇద్దరు ఉన్నారు.

2013లో చివరిసారిగా సొసైటీలకు ఎన్నికలు..

చేనేత కార్మికులకు ఉపాధిని ఇస్తూ పరిశ్రమ అభివృద్ధికి వారధిగా నిలుస్తున్న చేనేత సహకార సంఘాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఓటర్‌ జాబితాలను రూపొందించింది. చేనేత జౌళి శాఖ రంగాల్లో ఉన్న సొసైటీల ఎన్నికల గడువు ముగిసి ఏడేళ్లు దాటిపోయినా పర్సన్‌ ఇన్‌చార్జ్‌లతోనే సుదీర్ఘంగా కాలం వెల్లదీస్తున్నారు. 2024 సంవత్సరం జూన్‌లో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కాస్తా హడావిడి చేయడంతో కార్మికులు ఎన్నికలు జరుగుతాయని భావించారు. ఏర్పాట్ల వరకు వెళ్లి ఎన్నికల ఊసే మరిచారు. నేతన్నలకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నా చేనేత సంఘాల ఎన్నికలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శల మధ్య ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టారు. ఐదేళ్లకొకసారి నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013లో చివరిసారిగా నిర్వహించారు. వీరి పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. తర్వాత 16సార్లు గడువు పొడిగించారు.

Updated Date - Jun 13 , 2026 | 01:33 AM