పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెంచేలా బస్సు సర్వీసులు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:48 PM
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కనెక్టివిటీ పెంచేలా ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కనెక్టివిటీ పెంచేలా ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండులో శనివారం కాళేశ్వరం, యాదగిరిగుట్ట దేవాలయాలకు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడుతూ వేములవాడ నుంచి తిరుపతికి బస్ సర్వీస్ గతంలోనే ప్రారంభించామని, అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి వేములవాడ, సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల డిపో నుంచి బస్ సర్వీసులు పెంచాలని కోరినట్లు తెలిపారు. బస్టాండు ఆధునికీకరణకు రూ. కోటి 60 లక్షల నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. త్వరలోనే కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట బస్సు స్టేషన్లను ఆధునికీకరిస్తామని తెలిపారు. గతంలో తిప్పాపూర్ బస్టాండు తొలగిస్తామన్న సందర్భంలో తాను అండగా నిలిచానని, ఒకవేళ బస్టాండు తొలగించాల్సి వస్తే ఎక్స్‌కావేటర్ తనపై ఎక్కించిన తరువాతనే బస్టాండు వద్దకు వెళ్లాలని అడ్డుకున్నానని గుర్తు చేశారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామం నుంచి బస్సుల కనెక్టివిటీ పెంచాని, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని ఇందిరమ్మ రాజ్యం వచ్చాక లాభాల్లోకి ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. గతంలో ప్రయాణికులు లేక బస్టాండులు వెలవెలబోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కళకళలాడుతున్నాయని వివరించారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం వల్ల మహిళలు తమ ఆదాయాన్ని గణనీయంగా ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలు కలుపుకుని ఆలయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారని అన్నారు. త్వరలో భద్రాచలం, బాసర పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీస్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్ ఐల శ్రీనివాస్ ఆర్టీసీ డిపో మేనేజర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.