ప్రశ్నించే గొంతుకలపై పాశవిక చర్యలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:54 AM
ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్ప డుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.
గంభీరావుపేట, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్ప డుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్రం అవలంబిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్‌లో ప్రజల ఓటు హక్కును కూడా తొలగించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశా రు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును చాడ వెంకటరెడ్డి శుక్రవారం సందర్శించారు. బద్లావ్ జరూరీ హై-మార్పు కావాలి.. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించండి అనే నినాదం తో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర ఎగువ మానేరుకు చేరింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా మార్పు కావాలి అనే కార్యక్రమాన్ని చేప ట్టినట్లు,కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వ అనుసరిస్తున్న రాజ్యంగ, ప్రజావ్యతిరేక, ప్రజా ఆకాంక్షల వ్యతిరేక పాల నను ఎండగడుతూ ప్రజా చైతన్యయాత్రను కొనసాగిస్తు న్నామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు తెస్తా అని తేలేదని, మహిళలను జీరో ఖాతాలు తెరమని ఒక్కపైసా కూడా వేయలేదని, ఇలాంటి వైఫ ల్యాలే కాకుండా నీట్ పరీక్షలో పశ్నపత్రాలు లీకైతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దీనిపై జంతర్ మంతర్‌పై కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే లాఠీచార్జీ, కాల్పులకు పాల్పడిం దన్నారు. దీనిపై ప్రశ్నించే గొంతుకలపై ఇంత పాశవిక చర్యలేంటి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించిందని గుర్తు చేశారు. నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెరిగాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అడ్డే లేదని, ఇవేగాక జీఎస్టీ కూడా పెంచారని ఆరోపించారు. ఆదానీ, అంబానీలకు మాత్రం విపరీతం గా సహజ వనరులను కట్టబెడుతున్నారని, ప్రదానంగా గ్యాస్ నిక్షేపాలను కట్టబెట్టడం వల్లే మాములు కాంట్రా క్టర్‌గా ఆదానీ లక్షల కోట్ల శ్రీమంతుడిగా దేశంలోనే మూడో ధనవంతుడిగా త యారయ్యాడన్నారు. ప్రశ్నించే గొంతుక లైన వరవరరావుపై రాజద్రోహం కేసు పెట్టడం వల్ల బాంబాయిలో ఉన్నారని, మరో ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ సా యిబాబా చనిపోయాడని ఇలాంటి దు రాగాతాలు ఎన్నో ఉన్నాయని ఆన్నారు. భవిష్యత్‌లో మోదీ ప్రభుత్వం ఇంకా కొనసాగితే స్వాతంత్రం ఉండదని, ఆం దోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చలో డిల్లీ రామ్‌లీల మైదానంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
మానేరు ప్రాజెక్టును పరిరక్షించాలి
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పరిరక్షించి, పర్యాటక కేంద్రం గా మార్చాలని, అందుకోసం కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరుచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు పరిసరాలను, మత్తడి దూకే ప్రాం తాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రాంత కల్పత రువైన మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్షానికి గురైందని, కనీసం పుటిక తీయని పరిస్థితి నెలకొందని, వెంటనే యుద్దప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టాల న్నారు. ఎగువమానేరు సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతానని వెల్లడించారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి సుదర్శన్, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు, ఏఐఎస్‌ఎప్ జిల్లా అద్యక్షుడు కుర్ర రాకేష్, సామాజిక కార్యకర్త మంగళి చంద్రమౌళి, నాయకులు రమేష్ తదితరులు ఉన్నారు.