Share News

సంస్థాగత నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ దృష్టి

ABN , Publish Date - May 22 , 2026 | 12:54 AM

మరో రెండున్నర సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది.

సంస్థాగత నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ దృష్టి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మరో రెండున్నర సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దూరమైన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటే తప్ప వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీతో ధీటుగా తలపడే అవకాశం ఉండదని భావిస్తోంది. ఈ మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలని నిర్ణయించుకుంది. సభ్యత్వ నమోదు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

సభ్యత్వ నమోదుకు మాజీ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నియమించింది. నిర్ణయించిన బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీగా ఒక్కొక్కరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు సమన్వయంతో ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పన్యాల భూపతిరెడ్డి, మానకొండూర్‌ నియోజకవర్గ ఇంచార్జిగా పేరాల రవీందర్‌రావు, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా డాక్టర్‌ చిరుమిల్ల రాకేశ్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జీవీ రామకృష్ణారావును నియమించారు.

- డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై ఐటీ నిపుణులతో శిక్షణ

నియోజకవర్గ ఇంచార్జిలకు సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలకు తెలంగాణ భవన్‌లో త్వరలో డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై ఐటీ నిపుణులతో శిక్షణ ఇస్తారు. సంస్థాగత నిర్మాణం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థాయిల కమిటీలు, వాటి ప్రతినిధులు, వారికి సంబంధించిన సమాచారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నది. త్వరలో ఈ యాప్‌ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు శ్రీకారం చుడతారని సమాచారం. తెలంగాణ భవన్‌లో శిక్షణ పొందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లాస్థాయిలో ఇప్పటికే నియమించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌కు ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి జిల్లా కేంద్రాల్లో వారంరోజులపాటు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. డిజిటల్‌ శిక్షణ పూర్తికాగానే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటించి సభ్యత్వాలు స్వీకరిస్తారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసేందుకు షెడ్యూల్‌ను ఇవ్వనున్నట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి పునరావృతమైతే ఇబ్బందికరంగా ఉంటుంది. బూత్‌, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటే పార్టీ కేడర్‌తో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్లే వీలుంటుందని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేని కారణంగానే ప్రజలకు దూరమై అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని పార్టీ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ కారణంగానే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిందని సమాచారం.

Updated Date - May 22 , 2026 | 12:54 AM