స్నేహితుడి యూపీఐ ద్వారా లంచాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:43 PM
జగిత్యాల జిల్లా బీమారం మండల కేంద్రానికి చెందిన గుండేటి రాము, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన జక్కని వేణు 2005 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు.
కరీంనగర్ క్రైం/జగిత్యాల టౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా బీమారం మండల కేంద్రానికి చెందిన గుండేటి రాము, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన జక్కని వేణు 2005 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. అనంతరం గుండేటి రాము ఎక్సైజ్ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఐగా పదోన్నతి పొందాడు. 2022 నుంచి 2024 వరకు వేములవాడ సీఐగా పని చేశాడు. ఆ సమయంలో ఓ బెల్లం వ్యాపారి నుంచి లంచాలు తీసుకున్నాడు. ఆ డబ్బులు నేరుగా తీసుకోకుండా జక్కని వేణు యూపీఐకి పంపించాలని చెప్పేవాడు. అనంతరం వేణు ఆ డబ్బులను రాము ఖాతాకు పంపించేవాడు. ఈ విషయంపై ఓ గుర్తు తెలియని వ్యక్తులు ఎక్సైజ్ డీజీ ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. దీంతో లంచాల వ్యవహారం బయటపడింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లోని ఎక్సైజ్ సీఐ బింగి రాము ఇంట్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని 20 లక్షల రూపాయలు, బంగారు ఆభరాణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఎక్సైజ్ సీఐ రాము, ఉపాధ్యాయుడు జక్కని వేణును అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.