Share News

ఆత్మ’కు ఊపిరి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:59 AM

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది.

ఆత్మ’కు ఊపిరి

జగిత్యాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది. నిధుల లేమితో పదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆత్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కేటాయించింది. దీంతో తిరిగి రైతు శిక్షణ కార్యక్రమాలు, కిసాన్‌ మేళాలు, విజ్ఞాన యాత్రలు, క్షేత్ర పర్యటనలు కొనసాగించే అవకాశం ఏర్పడింది. జిల్లాకు రూ. 9.05 లక్షల నిధుల కేటాయించింది. ఇందులో కిసాన్‌ మేళాకు రూ. 6 లక్షలు, ఇతర పనులకు రూ. 3.05 లక్షల నిధులు కేటాయించారు.

ఫకమిటీల ఏర్పాటు

ఆత్మ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే గవర్నింగ్‌ బోర్డు మూడు నెలలకోసారి సమావేశమై ప్రగతి నివేదికలను సమీక్షిస్తుంది. అవసరమైన బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. బ్లాక్‌ స్థాయిలో ఆత్మ కింద ఫార్మర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అడ్వయిజరీ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని వ్యవసాయ డివిజన్లలో వ్యవసాయ సహాయ సంచాలకులు కన్వీనర్‌గా ఉంటారు. ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఎఫ్‌ఏసీ (ఫార్మర్‌ అడ్వయిజరీ కమిటీ)ల్లో 11 నుంచి 15 మంది మహిళలు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నెలకోసారి సమావేశమై వారి సూచనలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 73 మంది సభ్యులతో ఫార్మర్‌ అడ్వయిజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇందులో జగిత్యాల వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో 29 మంది, ధర్మపురి డివిజన్‌లో 23 మంది, కోరుట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో 21 మంది సభ్యుల నియామకం చేపట్టారు.

ఫరైతులకు ప్రయోజనం...

ఆత్మ ద్వారా బ్లాక్‌, జిల్లా స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతులను వ్యవసాయ విజ్ఞాన యాత్రలకు పంపించి పంట క్షేత్రాలను పరిశీలింపజేస్తారు. కిసాన్‌ గోష్ఠి నిర్వహిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్దతులపై రైతులకు తెలుపుతారు. ప్రస్తుతం వ్యవసాయం ఆధునిక పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో విఙ్ఞాన యాత్రలు రైతులకు మేలు చేయనున్నాయి. ఏ ప్రాంతంలో వ్యవసాయంలో ఎలాంటి పరికరాలు వాడుతున్నారు. అవి తమ ప్రాంతాల్లో వాడొచ్చా అనే విషయాన్ని రైతులు తెలుసుకుంటారు.

నిర్వహించే కార్యక్రమాలు..

ఫ రైతు శిక్షణలు

ఫ రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శనలు

ఫ రైతుల క్షేత్ర సందర్శనలు

ఫ కిసాన్‌ మేళాలు

ఫ ఎగ్జిబిషన్లు

ఫ రైతు-శాస్త్రవేత్తల ఇష్టాగోష్టిలు

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం

- కాటిపల్లి గంగారెడ్డి, ఆత్మ చైర్మన్‌

ప్రభుత్వం ఫార్మర్‌ అడ్వయిజరీ కమిటీలను నియమించడం సంతోషకరం. జిల్లాలో 73 మంది సభ్యులతో ఆత్మ కమిటీని ఏర్పరిచారు. ఇందుకు కృషి చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు కృతజ్ఞతలు. రైతులకు మరింత మేలైన సేవలు అందించడానికి కృషి చేస్తాం.

రైతు సలహా కమిటీ నియామకం హర్షణీయం

- వెలుమల రాంరెడ్డి, అగ్రివర్సిటీ మాజీ సభ్యుడు

జిల్లాలో రైతు సలహా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షణీయం. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం, యంత్ర పరికరాలు అదించడంలో కీలక పాత్ర పోషించనుంది. మార్కెట్‌లో మద్దతు ధరలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలను రైతులకు అందించడంలో కమిటీ తోడ్పడుతుంది.

నిధులు వచ్చాయి...

-భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఆత్మ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.9.05 లక్షలు మంజూరయ్యాయి. కలెక్టర్‌ అనుమతి తర్వాత కార్యక్రమాలు చేపడతాం. ఇక నుంచి రైతులకు విస్తృత సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులకు వ్యవసాయ విఙ్ఞానాన్ని అందించే ఆత్మ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.

Updated Date - Mar 13 , 2026 | 12:59 AM