ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:26 AM
ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
- పుట్ట బంగారం కోసం స్వామి వారల సేవలు ఊరేగింపు
- పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేళలో మంగళవాయిద్యాలు వెంట రాగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వేదపండితులు యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్యుల ఇంటికి వెళ్లి ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం సాంప్రదాయ రీతిలో యజ్ఞాచార్యులను ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ చైర్మన, ఈవో అర్చకులకు దీక్షావస్త్రాలు సమర్పించారు. అనంతరం స్థానిక లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో అర్చకులు అంకురార్పణ, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు స్వామి వారలకు కరీంనగర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన ఎల్లాల శ్రీకాంతరెడ్డి, స్వంతంగా స్వామి వారలకు పట్టు వసా్త్రలు సమర్పించారు.
పుట్ట బంగారం కోసం స్వామి వారలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళలో లక్ష్మీ నృసింహస్వామి (యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి వారల ఉత్సవమూర్తులను సేవలపై ఆశీనులు చేసి పుట్ట బంగారం కోసం తీసుకెళ్లారు. అనంతరం చింతామణి చెరువు వద్ద మట్టిని తవ్వి ఆలయాలకు పుట్ట బంగారం తీసుకువచ్చారు. సేవలను తిరిగి ఆలయాలకు తీసుకురాగా దారిపొడవుగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రాత్రివరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన వేముల నాగలక్ష్మి, కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మహేష్, ఉదయ్‌కుమార్, సతీష్, కృష్ణసాగర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.
- ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి శేషప్ప కళావేదికపై శుక్రవారం రాత్రి వరంగల్ నృత్య రమణి కళా క్షేత్రానికి చెందిన చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలను భక్తులు అర్ధరాత్రి వరకు తిలకించారు.
- నేడు కల్యాణం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీమఠం స్థలంలో గల యాగశాల వద్ద కళ్యాణ వేదికపైన లక్ష్మీ నృసింహ స్వామి (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర స్వాముల కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.