Share News

మళ్లీ తెరపైకి బీపీఎల్‌ భూములు..

ABN , Publish Date - May 11 , 2026 | 02:06 AM

రామగుండం బీపీఎల్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములను రైతులు సాగు చేసుకునేలా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ప్రోత్సహిస్తున్నారనే కారణంగా బీపీఎల్‌ సంస్థ ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ ఇప్పించడంతో ఈ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చాయి.

మళ్లీ తెరపైకి బీపీఎల్‌ భూములు..

- 520 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం 1815 ఎకరాల భూముల సేకరణ

- 22 ఏళ్ల క్రితం అర్ధంతరంగా పనులను నిలిపివేసిన సంస్థ

- 2004లో పీపీఏ, బొగ్గు ఒప్పందాలను రద్దు చేసిన అప్పటి ప్రభుత్వం

- ఆయా గ్రామాల్లో ఏళ్లుగా కొన్ని భూములను సాగు చేసుకుంటున్న రైతులు

- ఎమ్మెల్యే ప్రోద్బలంతోనేనని సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌

- మా భూములు మాకే ఇవ్వాలంటున్న రైతులు

పెద్దపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): రామగుండం బీపీఎల్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములను రైతులు సాగు చేసుకునేలా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ప్రోత్సహిస్తున్నారనే కారణంగా బీపీఎల్‌ సంస్థ ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ ఇప్పించడంతో ఈ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ స్పందించక పోగా, ప్రాజెక్టు కోసం 25 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో ప్రాజెక్టు ఏర్పాటు చేయడం లేదని, మా భూములు మాకే ఇవ్వాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిజాం కాలంలో ఏ పవర్‌హౌస్‌ను నిర్మించగా, అది శిథిలావస్థకు చేరడంతో మూసివేశారు దాని స్థానంలో 520 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బీపీఎల్‌, జపాన్‌కు చెందిన తోషిభా ఎలక్ర్టికల్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఈపీడీసీ) ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2,813.9 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం పీపీఏ చేసుకున్నది. మెయిన్‌ప్లాంట్‌, రిజర్వాయర్‌, యాష్‌పాండ్‌, పైప్‌లైన్‌ నిర్మాణాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలో 1999-2000 సంవత్సరంలో ప్రాజెక్టు కోసం 1815.03 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో మల్యాలపల్లి గ్రామంలో రైతుల నుంచి 169.25 ఎకరాలు, ప్రభుత్వ భూములు 87.08 ఎకరాలు, కుందనపల్లిలో రైతుల భూములు 51.21 ఎకరాలు, ప్రభుత్వ భూములు 4.23 ఎకరాలు, రామగుండంలో రైతులవి 6.29 ఎకరాలు, ప్రభుత్వ భూములు 181.39 ఎకరాలు, రాయదండిలో రైతులవి 384.22 ఎకరాలు, ప్రభుత్వ భూములు 228.06 ఎకరాలు, బ్రాహ్మణపల్లిలో రైతుల భూములు 640.19 ఎకరాలు, ప్రభుత్వ భూములు 33.35 ఎకరాలు, ఎల్లంపల్లిలో రైతుల భూములు 7.13 ఎకరాలు, ప్రభుత్వ భూములు 4.02 ఎకరాలు, గోలివాడలో రైతుల భూములు 10.29 ఎకరాలు, ప్రభుత్వ భూములు 5.13 ఎకరాలు, మొత్తం రైతుల భూములు 1271.38 ఎకరాలు, ప్రభుత్వ భూములు 543.05 ఎకరాల భూములు ఉన్నాయి. రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరానికి 16 వేల నుంచి 30 వేల రూపాయల పరిహారం చెల్లించారు. ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి.

ఫ రూ. 150 కోట్ల విలువైన పనులు పూర్తి..

అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో 2002లో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ) మేరకు బీపీఎల్‌ సంస్థ ప్లాంట్‌ నిర్మాణ పనులను ఆరంభించింది. మెయిన్‌ ప్లాంట్‌ పనులు పిల్లర్ల వరకు పూర్తి చేసి పనులను నిలిపి వేశారు. కార్యాలయ భవనం, ప్రహరీ, ఇతరత్రా పనులు చేపట్టారు. సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఈ పనులకు వెచ్చించారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగక పోవడంతో 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సింగరేణి నుంచి బొగ్గు సరఫరా ఒప్పందాల్ని, పీపీఏను రద్దు చేశారు. అలాగే విద్యుత్‌ ప్లాంట్‌ కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని బీపీఎల్‌ సంస్థ యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 520 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం భూములను అప్పటి ఏపీఎస్‌ఈబీ ద్వారా సేకరించి బీపీఎల్‌ సంస్థకు ఇచ్చారు. ఈ భూములను ఏపీఎస్‌ఈబీ లీజుకు గాకుండా సేల్‌ డీడ్‌ కింద ఇవ్వడంతో ఈ భూములు తమవేనని, ఇందుకోసం డబ్బులు చెల్లించి తీసుకున్నామని బీపీఎల్‌ సంస్థ వాదించింది. అప్పుడు బీపీఎల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2004లో భూములు వివాదంలోకి వెళ్లడంతో ఆయా గ్రామాల్లో కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా రామగుండంలో బీపీఎల్‌ ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, విభజన చట్టంలో భాగంగా తెలంగాణ కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేపట్లాల్సి ఉంది. మొదటి దశలో రెండు యూనిట్లు 1600 మెగావాట్ల విద్యుత్‌ కోసం పీపీఏ కుదుర్చుకున్నది. దీంతో బీపీఎల్‌తో పీపీఏ చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా బీపీఎల్‌ చేపట్టిన పనులు ఆర్ధంతరంగా నిలిచిపోగా, భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూముల్లో కొన్నింటిని రైతులు సాగు చేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన భూముల్లో రైతులు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ ప్రోద్భలంతోనే సాగు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు జారీ చేయడంతో బీపీఎల్‌ భూములు మళ్లీ తెరపైకి వచ్చాయి. బీపీఎల్‌కు ఇచ్చిన భూముల్లో రైతుల భూములే గాకుండా 543 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అక్కడ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణమే జరగనప్పుడు వారి చేతుల్లోనే ఎందుకు ఉండాలని, మా భూములు మాకే ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ముందుకు వచ్చి చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 11 , 2026 | 02:06 AM