Share News

ఏడు రకాలకే బోనస్‌..

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:01 AM

సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్‌ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది.

 ఏడు రకాలకే బోనస్‌..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్‌ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్‌ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. అధిక దిగు బడులు ఇచ్చే, బహిరంగ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికా రులు చెబుతున్నారు. జిల్లాలో రైతులకు అవగా హన కల్పించేందుకు మంగళవారం నుంచి రైతు వేదికల ద్వారా విత్తన మేళాలను నిర్వహిస్తు న్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని రైతులకు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రకాలనే సాగు చేస్తే క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందుతుందని వివరిస్తున్నారు.

ఫ ఏడు రకాలకే ప్రాధాన్యం

బీపీటీ- 5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా, వరంగల్‌-44, కేఎన్‌ఎం-7715 రకాల సన్న ధాన్యానికే ఈ సీజన్‌లో బోనస్‌ వర్తించనుంది. ఈ రకాలకే మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో పాటు అధిక దిగుబడులు సాధ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పలువురు రైతులు ఆయా రకాల విత్త్తనాల సేక రణలో నిమగ్నమయ్యారు. కొందరు రైతులు వరి నార్లు కూడా పోశారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 2.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ నీటితో సాగయ్యే ప్రాంతాల్లో రైతులు సన్న రకం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

ఫ బోనస్‌తో జిల్లాలో పెరిగిన సన్నాల సాగు

రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్స హిస్తోంది. ఈ క్రమంలో క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ అందిస్తోంది. 2024 వానాకాలం సీజన్‌లో జిల్లాలో 70 శాతానికి పైగా సన్న రకం వరి సాగు జరగగా, రైతులకు సుమారు రూ.105 కోట్ల బోనస్‌ చెల్లించింది. 2025 వానాకాలంలో సన్న రకాల సాగు 85 శాతానికి పెరగడంతో బోనస్‌ మొత్తం రూ.130 కోట్లకు చేరింది. అయితే ఈసారి అన్ని సన్నరకాలు కాకుండా ఎంపిక చేసిన ఏడు రకాలకే బోనస్‌ వర్తింపజేయడంతో రైతుల్లో ఆసక్తితోపాటు కొంత సందిగ్ధత కూడా నెలకొంది.

ఫ యూరియా యాప్‌పై అవగాహన

విత్తనమేళాల్లో బోనస్‌కు సంబంధించిన వివ రాలతోపాటు యూరియా యాప్‌ వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకు ఈ సీజన్‌లో సుమారు 34వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా, ప్రస్తు తం 26వేల టన్నులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన నిల్వలు కూడా త్వరలో జిల్లాకు చేరనున్నాయని పేర్కొం టున్నారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు.

ఫ ప్రతిపక్షాల విమర్శలు

బోనస్‌ చెల్లింపులను పరిమితం చేసేందుకే ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధిస్తోందని బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. యూరియా యాప్‌ను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు అవగా హన కల్పిస్తూ, నాణ్యమైన సన్న రకాల సాగును ప్రోత్సహించే దిశగా ముందుకు సాగుతోంది.

Updated Date - Jun 24 , 2026 | 01:01 AM