బోనాల సంబరాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:16 AM
సిరిసిల్ల పట్టణం ఆషాఢ మాసం బోనమెత్తుకుంది.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణం ఆషాఢ మాసం బోనమెత్తుకుంది. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో బోనాలతో జాతర సాగింది. ఇంటికో బోనంతో పట్టణం అంతా పండుగ వాతావరణంగా మారింది. వార్డు కౌన్సిలర్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరుపుకున్నారు. 3వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణితో పాటు మహిళలు బోనం ఎత్తుకోగా, డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తులు శిగాలు ఊగగా, పోతరాజులు, యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ ముత్యాల పోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. చైర్‌పర్సన్, మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం, నూతనవస్త్రాలను సమర్పించుకున్నారు. వెంకటంపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, మైసమ్మ బోనాలను నిర్వహించారు. మున్నూరుకాపు సామాజిక వర్గంకు చెందిన మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. నెహ్రూనగర్ స్థానిక మహిళలు మహంకాళి బోనాలను నిర్వహించి అంబా భవానికి బోనాలను సమర్పించుకున్నారు. ఉదయంనుంచి సాయంత్ర వరకు పట్టణంలోని పోచమ్మ, మైసమ్మ, అంబా భవాణి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం సమర్పించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. పొచమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబ డి క్యూలైన్‌లో నిలబడి దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు జగిత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జగిత్యాల పెద్దదేవయ్య, ప్రధాన కార్యదర్శి ఎర్రం మల్లయ్య, కోశాధికారి గోక లక్ష్మీరాజం, సహాయ కార్యదర్శి చొక్కి తిరుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు బైరి ప్రభాకర్, అంబా భవాని దేవాలయం ట్రస్టు చైర్మన్ చిలుక నారాయణ, సభ్యులు చిమ్మని ప్రకాష్, తాటి వెంకన్న, బూర భాస్కర్, కట్ల సంజీవ్, ఆడెపు సంపత్, మోహన్ పాల్గొన్నారు.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని బోనం సంబురం కొనసాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురువాలని పంటలు పచ్చగా పండాలని, గ్రామం శుభిక్షంగా ఉండాలని కోరుకంటూ గ్రామ దేవతలకు ఆదివారం భక్తి శ్రద్దలతో బోనాలు తీశారు. మండలంలోని రాజుపేట, కొత్తపల్లి గ్రామాల్లో పోచమ్మ, మహంకాళి అమ్మవారికి గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసి, నైవేద్యం సమర్పించారు. గ్రామాల్లో ప్రధాన వీధుల వెంట మహిళలు బోనమెత్తుకుని ఆలయాల వరకు వెళ్ళి, ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగా వాతావరణం నెలకొంది.
తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో లక్ష్మీన ర్సింహస్వామి ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సింహస్వామికి బోనాలు సమర్పించారు. ఆదివారం ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ప్రతి ఇంటి నుంచి బోనం తీసి డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో ఊరేగించారు. అనంతరం గ్రామ ఆలయాల్లో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంగిటి అంజయ్య, ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బోన్ల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి, ఉపసర్పంచ్ పుట్ట భాను, గ్రామ కమిటీ అధ్య క్షుడు భామనగారి పెద్దయ్య, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. డప్పుచ ప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని ఆదివా రం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.