Share News

మైలారం మల్లన్న బ్రహ్మోత్సవాలకు బోటు సౌకర్యం

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:59 PM

గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎల్‌ఎండీ నుంచి బోటు సౌకర్యం కల్పించారు. ఈ బోటులో 20 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.

మైలారం మల్లన్న బ్రహ్మోత్సవాలకు బోటు సౌకర్యం
కరీంనగర్‌ ఎల్‌ఎండీ నుంచి మైలారానికి బోటులో వెళుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌/గన్నేరువరం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎల్‌ఎండీ నుంచి బోటు సౌకర్యం కల్పించారు. ఈ బోటులో 20 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ బోటును కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోమవారం ప్రారంభించారు. కొద్దిసేపు బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు భ్రమరాంబ సమేత స్వయంభూ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మహారుద్ర యాగం జరుగనుందన్నారు. కరీంనగర్‌ నుంచి అనేక మంది భక్తులు మైలారం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారన్నారు. కరీంనగర్‌ నుంచి మైలారం రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు 45 నిమిషాలు పడుతుందని, బోటులో 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులు త్వరగా వెళ్ళి వచ్చేందుకు అవకాశం కల్పించాలని టూరిజం శాఖకు విజ్ఞప్తి చేయగా వారు బోటు నడిపేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ఈ బోటు ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు నడుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, ఆలయ ప్రదాన అర్చకుడు మామిడాల నాగసాయి శర్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:59 PM