వైద్యం పేరుతో నిలువు దోపిడీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:53 AM
డివిజన్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ప్రైవేట్ దవాఖానలు సుమారు 100 వరకు ఉంటాయి. వీటిలో స్కానింగ్ కేంద్రాలుగా, డయాగ్నోస్టిక్, ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్లు, మెడికల్ షాపులు ఉన్నాయి.
- ల్యాబ్‌లు, ఎక్స్‌రే, డయాగ్నోస్టిక్, మెడికల్ షాపుల ఇష్టారాజ్యం
- టెస్టులకు వాళ్లు పెట్టిందే రేటు
- గుట్టుగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు?
- అనర్హులతో మెడికల్ షాపుల నిర్వహణ
హుజూరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. ఆరోగ్య పరీక్షల పేరిట ప్రైవేట్ డయాగ్నోస్టిక్, ల్యాబ్‌లు, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్లు ఉండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. వైద్య పరీక్షలకు సంబంధించి ఎలాంటి ధరల పట్టిక ఆయా ఆస్పత్రుల్లో, స్కానింగ్ సెంటర్లలో కనబడడం లేదు. అనధికారికంగా సెంటర్లు నడిపిస్తూ నిబంధనలు పాటించకుండా రోగుల వద్ద వేలాది రూపాయలు గుంజుతున్నారు. వైద్యుడి మాటను కాదని మరో చోట పరీక్షలు చేయించుకునే ధైర్యం లేక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు పెట్టిన ఫీజు చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఫ పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు
హుజూరాబాద్ డివిజన్‌లోని లెక్కలేనన్ని డయాగ్నోస్టిక్, స్కానింగ్, ఎక్స్‌రే, ల్యాబ్ సెంటర్లు, మెడికల్ షాపులు పుట్టుకొస్తున్నాయి. తమ లాభాలతో పాటు దళారులకు, రిఫరల్ వైద్యులకు ఇవ్వాల్సిన కమీషన్లను కూడా రోగి నుంచి వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా సిటీ స్కాన్, ఈసీజీ, ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు తదితర వంటివి నిర్వహిస్తున్నారు. వీరు వసూలు చేసే సొమ్ములో 40శాతం కమీషన్లు దళారులకు రిఫరల్ వైద్యులకు చెల్లిస్తున్నారు. వైద్యఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఫ రోగులతో వ్యాపారం
డివిజన్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ప్రైవేట్ దవాఖానలు సుమారు 100 వరకు ఉంటాయి. వీటిలో స్కానింగ్ కేంద్రాలుగా, డయాగ్నోస్టిక్, ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్లు, మెడికల్ షాపులు ఉన్నాయి. డీఎంఎల్‌టీ, రేడియోలజిస్ట్, ఫార్మసిస్ట్ కోర్సులు చదవకున్నా కేవలం అనుభవం ఉన్న వారితో ఈ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారు. మెడికల్ దుకాణాలు పేరు ఒకరిదైతే మరొకరి పేరు మీద నడిపిస్తున్నారు. జనరిక్ పేరుతో అడ్డగోలుగా మందులు అంటగట్టి దోచుకుంటున్నారు. మందులకు బిల్లులు సైతం ఇవ్వడం లేదు. కొందరు ప్రైవేట్ మెడికల్ షాపుల నిర్వాహకులు డ్రాక్టర్లను తీసుకొచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా దవాఖానాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఫ యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించినా లింగ నిర్ధారణ పరీక్షలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. పరీక్షలు చేయించుకున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. ఈ పరీక్షలు చేసేందుకు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సహకరిస్తున్నారని, ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 20వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం అవసరమైతే అబార్షన్లు కూడా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో హుజూరాబాద్, జమ్మికుంటలలో పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చినా, మళ్లీ కొత్త సెంటర్లు పుట్టుకొస్తుండడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
ఫ పట్టించుకోని ఆరోగ్య శాఖ.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
ప్రైవేట్ డయాగ్నోస్టిక్, స్కానింగ్, ల్యాబ్, మెడికల్ షాపుల పనితీరుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లపై నాణ్యత ధరల పట్టిక విషయంలో నిరంతరం తనిఖీలు చేయకుండా మౌనంగా ఉండడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లపై నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.