ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:01 AM
పది సంవత్సరాలు ఇటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీలు అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్‌లో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అవినీతి కవలలుగా నగర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారని డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
కరీంనగర్ అర్బన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పది సంవత్సరాలు ఇటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీలు అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్‌లో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అవినీతి కవలలుగా నగర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారని డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు పార్టీల నాయకులు కలిసి కరీంనగర్‌ను అవినీతికి అడ్డాగా మార్చారని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో పర్సంటేజీ కల్చర్‌తో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఏ విధంగా దోచుకున్నారో నగర ప్రజలందరికీ తెలుసన్నారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, కరీంనగర్ ఎంపీగా బీజేపీని గెలిపించి కేంద్రమంత్రిని చేశారని, నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు రెండుసార్లు అవకాశం ఇస్తే స్మార్ట్ సిటీ పనులలో, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి జేబులు నింపుకోవడానికి మాత్రమే వారు పని చేశారని ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై విజిలెన్స్ ఎంక్వయిరీ నడుస్తుందన్నారు. డంపింగ్ యార్డు సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల భూకబ్జాలు, అవినీతి తారస్థాయిని నగర ప్రజలు చూశారని, గతంలో పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్నన్ని రోజులు బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు కాలు బయట పెట్టడానికి భయపడ్డారని అన్నారు. స్మార్ట్ సిటీ సేఫ్ సిటీగా ఉండాలంటే మేధావులు, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో 90 శాతంపైగా కాంగ్రెస్‌పార్టీ గెలుచుకోబోతుందని అన్నారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకొని కార్పొరేషన్‌పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, మేనేని రాజనర్సింగారావు, ముద్దం తిరుపతి, ముద్దసాని రంగన్న, బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, రామిడి రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, లింగంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.