Share News

‘ఉపాధిహామీ’కి రాంరాం..

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:17 AM

గ్రామాల్లోని దుర్భర పరిస్థితుల నేపథ్యంలో వలస వెళుతున్న కూలీలకు సొంత ఊళ్లోనే ఉపాధిని అందించే దిశగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతన్న మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

‘ఉపాధిహామీ’కి రాంరాం..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామాల్లోని దుర్భర పరిస్థితుల నేపథ్యంలో వలస వెళుతున్న కూలీలకు సొంత ఊళ్లోనే ఉపాధిని అందించే దిశగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతన్న మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సేవలకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గుడ్‌ బై పలుకుతూ ఆ స్థానంలో వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ జీ రామ్‌ జీ) పేరుతో బుధవారం ఈ పథకం అమల్లోకి వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98,232 జాబ్‌ కార్డులు ఉండగా, 1,99,715 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 1,02,151 మంది మహిళలు ఉన్నారు. యాక్టివ్‌ కూలీల 57,253 జాబ్‌ కార్డులో 86,236 మంది పనిచేస్తున్నారు. మహిళలు 53,410 మంది ఉన్నారు. కూలీల్లో ఎస్సీలు 52,540మంది, ఎస్టీలు 15,317 మంది, ఇతరులు 1,31,858 మంది ఉన్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు కలిగిన ఇబ్బందులను తొలగించడంతో పాటు కొత్త పథకంలో అనేక మార్పులు, చేర్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75 నుంచి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 25 వరకు నిధులు వెచ్చించేవి. వీబీజీ రామ్‌జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులను సమకూర్చేలా మార్పులు చేశారు.

కూలీలకు 125 పనిదినాలకు పెంపు

కేంద్ర ప్రభుత్వం 2025లో వీబీజీ రామ్‌జీ చట్టం రూపొందించి చట్టసభల్లో ఆమోదించింది. దీని ప్రకారం గతంలో కూలీలకు 100 రోజులు పని దినాలను కల్పిస్తే వీబీజీ రామ్‌జీలో 125 రోజులకు పెంచారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లింపు, ఒకవేళ ఆలస్యమైతే వేతనంతో పాటు పరిహారం చెల్లిస్తారు. కూలీలకు 15 రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి కూలీల ఖాతాల్లో జమవుతుంది. ఈ పథకంలో నాలుగు విభాగాలుగా పనులను విభజించారు. వీబీజీ రామ్‌జీ ద్వారా గ్రామాల్లో చేపట్టే అన్ని పనులను గ్రామపంచాయతీ ప్రణాళికలో నమోదు చేస్తారు. దీని ద్వారా చేసిన పనులు మళ్లీ మళ్లీ చేయడం తగ్గుతుంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. గతంలో జరిగిన అక్రమాలు తొలగిపోతాయని భావిస్తున్నారు. వ్యవసాయంలో 50 శాతం పనులు చేపట్టే వీలు ఉంది. పంటల సాగులో విత్తనాలు వేయడం. పంట కోతుల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకునే వీలుంది. 60 రోజులపాటు వ్యవసాయ పనులు సజావుగా సాగే వీలు కల్పించారు.

కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు

వీబీ జీ రామ్‌ జీ పథకంలో సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు జారీ చేయడానికి నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60ఏళ్లు పైబడిన వారికి, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డులను అందజేస్తారు. ఆరు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఉపాధి పథకం జాబ్‌కార్డ్‌ స్థానంలో గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డును ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లు మాత్రమే ఇస్తారు. ప్రత్యేక వర్గాలకు స్పెషల్‌ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్‌ విధానంలో మార్పులతో రాష్ట్రాలకు లేబర్‌ బడ్జెట్‌ ఉండదు. కేంద్రం నుంచే నిధులు నిర్దేశిస్తారు. డిమాండ్‌ పెరిగితే అదనపు ఖర్చును రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగితే గతంలో రూ వేయ్యి జరిమానా విధించేవారు. కొత్త పథకం ద్వారా జరిమానా రూ.10 వేలకు పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులపై ఎలా స్పందిస్తుందనేది కూలీల్లో అయోమయంగానే ఉంది.

ఉద్యోగుల హోదాల్లో మార్పులు

ఉపాధిహామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌, ఫీల్డ్‌అసిస్టెంట్లు అందరూ వీ బీజీ రామ్‌ జీ పరిధిలోకి వస్తారు. ఉద్యోగుల హోదాలు కూడా మారుతాయి. హైదరాబాదులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వీబీజీ రామ్‌జీ ఉద్యోగులు శిక్షణ పొంది వచ్చారు. ఉపాధిహామీ పథకంలో పని చేసిన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇకపై కంప్యూటర్‌ ఆపరేటర్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్లు డిజిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను గ్రామీణ రోజ్‌గార్‌ సహాయక లేదా గ్రామ కాయకల్ప సహాయక్‌గా, టెక్నికల్‌ అసిస్టెంట్లను రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసోసియేట్‌గా పిలుస్తారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు మిషన్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌గా మారనున్నారు. అడిషనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్‌ మిషన్‌ మేనేజర్‌గా మారుతుంది.

జిల్లాలో వీబీజీ రామ్‌జీ వివరాలు..

మండలం జాబ్‌ కార్డులు కూలీలు మహిళలు

గంభీరావుపేట్‌ 12,355 27,011 13,391

కోనరావుపేట 11,250 23,436 11,781

బోయిన్‌పల్లి 7,602 14,674 7,520

చందుర్తి 8,027 17,094 8,036

ఇల్లంతకుంట 10,632 20,990 11,004

ముస్తాబాద్‌ 10,219 17,715 9,767

వేములవాడ 4,027 7,332 4,000

ఎల్లారెడ్డిపేట 12,478 27,938 13,731

రుద్రంగి 3,101 6,308 3,453

తంగళ్ళపల్లి 8,965 16,960 9,307

వీర్నపల్లి 4,328 9,764 4,798

వేములవాడరూరల్‌ 53,339 10,493 5,363

మొత్తం 98,323 1,99,715 1,02,151

Updated Date - Jul 01 , 2026 | 01:17 AM