Share News

భక్తజనసంద్రంగా భీమన్న సన్నిధి

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:37 AM

వేములవాడ భీమేశ్వరస్వామి దేవస్థానం భక్తజనసంద్రమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50 వేలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు.

భక్తజనసంద్రంగా భీమన్న సన్నిధి
స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

- మొక్కులు చెల్లించిన 50 వేల మంది

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వరస్వామి దేవస్థానం భక్తజనసంద్రమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50 వేలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. వేలాదిమంది భక్తులు తలనీలాలు సమర్పించి కోడెల మొక్కులు చెల్లించారు. ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేక పూజలు చేశారు. స్వామివారికి కల్యాణం, సత్యనారాయణస్వామివ్రతాలు నిర్వహించారు. అనేకమంది భక్తులు స్వామివారికి మహాలింగార్చన, కుంకుమపూజలు, పెద్ద పల్లకి సేవలు, ఆకుల పూజలు చేసి భక్తిప్రపత్తిని చాటారు. రాజరాజేశ్వరస్వామివారిని ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్న ఈవో రమాదేవి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

- బద్దిపోచమ్మకు బోనాలు

భీమేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. వేలాదిమంది భక్తులతో బద్దిపోచమ్మ ఆలయం కిక్కిరిసిపోయింది. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులు పురవీధుల్లో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు.

Updated Date - Feb 23 , 2026 | 12:37 AM