Share News

సన్నాలకు ‘మద్దతు’ను మించి..

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:21 AM

సూపర్‌ ఎల్‌నినో విపత్తుతో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది.

సన్నాలకు ‘మద్దతు’ను మించి..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సూపర్‌ ఎల్‌నినో విపత్తుతో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సన్న రకం బియ్యం కిలో ‘సెంచరీ’ దాటే పరిస్థితుల్లో మిల్లర్లు కల్లాల వద్ద పచ్చివడ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సన్న రకం వడ్లకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్‌తో పాటు కనీస మద్దతు ధరకు మించి ధర పలుకుతుండడంతో రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వెళ్లడం, ధాన్యాన్ని ఆరబోసి అమ్ముకునే ఇబ్బందులు లేకుండా నేరుగా అమ్ముకునే అవకాశం రావడంతో నేరుగా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవడానికి ఇష్టపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ దృష్టిలో పెట్టుకొని రైతులు దొడ్డు రకం బదులు సన్న రకాలు ఎక్కువగా వేశారు. జిల్లాలో 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వరి 1.47 లక్ష ఎకరాలు వరి సాగు చేశారు. ఇందులో 90 వేల ఎకరాల వరకు సన్న రకం సాగు చేశారు. జిల్లాలో ఒకవైపు వరికోతలు జోరుగా సాగుతుండగా అదే స్థాయిలో కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 30వేల ఎకరాల వరకు కోతలు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం క్వింటాలకు రూ.2461, బి గ్రేడ్‌ రూ.2441 ధర నిర్ణయించారు. సన్న రకాలకు రూ.2461తో పాటు ప్రభుత్వం మరో రూ.500 బోనస్‌ ఇస్తోంది. ప్రస్తుతం జిల్లాలో దొడ్డు రకం వడ్లు క్వింటాలు రూ.2500 వరకు కొనుగోలు చేస్తుండగా.. సన్న వడ్లు రూ.3200 నుంచి రూ.3400 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యాసంగిలో క్రాప్‌ హాలిడేగా ప్రకటిస్తారని ఊహిస్తున్న క్రమంలో ధాన్యం లభించే అవకాశాలు తక్కువ కానున్నాయని భావించి పచ్చి పచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. మద్యం తయారీతో పాటు అటుకులు, పేలాలు ఉపయోగించడం ద్వారా మరింత కొరత ఏర్పడుతుందని భావించి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా పచ్చిధాన్యం కొనుగోలుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. మరి కొంతమంది మిల్లర్లు లోటు పూడ్చుకునేందుకు కొనుగోళ్లు జరుపుతున్నారు. జిల్లాలో కొనుగోళ్లకు డిమాండ్‌ ఏర్పడడంతో వ్యాపారులు వరి కోతల మిషన్ల యజమానుల నుంచి ముందే సమాచారం తీసుకొని ఏ రైతు వరి కోత చేస్తున్నాడో తెలుసుకొని వాలిపోతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ముందుగానే అడ్వాన్సులు చెల్లించి ధాన్యం తీసుకుంటున్నారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో దాన్యం దిగుబడి తగ్గిపోయిన వస్తున్న దిగుబడికి తేమతో ప్రమేయం లేకుండా ఆశాజనకంగా రైతులకు ధాన్యం ధర పలకడం ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాలో జోరుగా వరి కోతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. వానాకాలం సీజన్లో 1.47 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో గంభీరావుపేటలో 15,554 ఎకరాల్లో నాట్లు వేసుకోగా, ఇల్లంతకుంటలో 18,600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 18,273 ఎకరాలు, సిరిసిల్లలో 3,910 ఎకరాలు, తంగళ్లపల్లిలో 16,600 ఎకరాలు, వీర్నపల్లిలో 5,219 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16,363 ఎకరాలు, బోయినపల్లిలో 11,836 ఎకరాలు, చందుర్తిలో 12,800 ఎకరాలు, కోనరావుపేటలో 15,200 ఎకరాలు, రుద్రంగిలో 2,350 ఎకరాలు, వేములవాడలో 3,300 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 8,212 ఎకరాల్లో సాగు జరిగింది. వరి సాగు ప్రకారం 3,07,832 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనాలు వేసింది. ఇందులో స్థానికంగా ధాన్యం వినియోగించుకోవడం, మిల్లర్లు నేరుగా కొనుగోళ్లు 67,832 మెట్రిక్‌ టన్నులు మినహాయించి మిగతా 2.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నారు. ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు అక్టోబరు చివరి వారంలో ధాన్యం వస్తుందని దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. అక్టోబరులో 25వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం మార్కెట్‌లో వస్తుందని, అందులో పౌరసరఫరాల శాఖ ద్వారా 15వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు జరుగుతుందని అంచనాలు వేశారు. నవంబరులో 92,832 మెట్రిక్‌ టన్నుల్లో 47,832 మెట్రిక్‌ టన్నులు, డిసెంబరులో 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో 1,47,168 మెట్రిక్‌ టన్నులు, 2027 జనవరిలో 3 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు.

ఇంకా కొనుగోళ్లు ప్రారంభించని సర్కారు..

జిల్లాలో ఖరీఫ్‌లో 260 గ్రామపంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి పౌరసరఫరాల శాఖ ద్వారా సర్కార్‌ సన్నద్ధమైంది. ఇందుకోసం యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది. అక్టోబరు చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి నిర్ణయించినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు కేంద్రాలు ప్రారంభం కాలేదు. వరి కోతల ఒకవైపు జోరుగా సాగుతూ ప్రైవేట్‌ వ్యాపారులు, మిల్లర్లకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 132 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 96 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా ఒకటి, మెప్మా ద్వారా 7 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఉపయోగించడానికి 36,83,000 గన్నీ బ్యాగులు, 7,170 టార్పాలిన్‌లు, 15ప్యాడీ క్లీనర్లు, 333 మాయిశ్చరైజ్‌ మీటర్లు, 630 వేయింగ్‌ మిషన్లు సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు.

Updated Date - Oct 23 , 2026 | 12:21 AM