దొంగలున్నారు జాగ్రత్త...
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:52 AM
సంక్రాంతి సెలవులు వచ్చాయంటే పిల్లలు అమ్మమ్మ, నానమ్మ వద్దకు ఊరెళ్లేందుకు సిద్ధమవుతుంటారు.
కరీంనగర్ క్రైం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులు వచ్చాయంటే పిల్లలు అమ్మమ్మ, నానమ్మ వద్దకు ఊరెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఊరుకు వెళ్లి పిండి వంటలు పూర్తి చేసుకుని, పండగ సంబరాలు అక్కడే చేసుకుంటారు. స్వగ్రామాలు, పల్లెటూళ్లకు వెళ్లడం, విహారయాత్రలు, అమ్మమ్మ, తాతయ్య ఇళ్లకు వెళ్లి గడపటం వంటి అవకాశం సెలవుల్లోనే లభిస్తుంది. ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో సహా ఊరుకు వెళ్లడం దొంగలకు అవకాశంగా మారుతున్నది. పట్టణాల్లో నివాసం ఉంటున్న చాలా కుటుంబాలు సంక్రాంతి సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి దూర ప్రాంతాలకు విహారయాత్రలు, పల్లెటూర్లలో గడపటం వంటి కార్యక్రమాలు పెట్టుకుం టారు. ఈ అవకాశాన్ని దొంగలు వినియోగించుకుంటున్నారు. పోలీస్ కమిషనరేట్‌వ్యాప్తంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
ఫ పగటిపూట రెక్కీ నిర్వహిస్తూ..
పట్టణాల్లో పగటి పూట దొంగలు రెక్కీ నిర్వహిస్తూ వారు టార్గెట్‌గా చేసుకున్న ఇళ్ల వద్ద పరిసరాలను గమనిస్తున్నారు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇళ్లలోకి వెళ్లి బంగారం, వెండి, నగదు చోరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పగటి పూటనే రైతులు ఇళ్లకు తాళం వేసి వ్యవసాయ పనులకు వెళుతున్న సమయంలో అదనుచూసి ఇళ్లు లూటీ చేస్తున్నారు. ఒక వైపు బ్లూకోట్స్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగానే మరో వైపు దొంగలు చోరీలకు పాల్పడుతుండటం ఆందోళనను కలిగిస్తున్నది. దొంగతనాలు జరిగిన తరువాత పోలీసులు కేసు, విచారణ చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా, వేలి ముద్రల ఆధారంగా దొంగలను అరెస్టు చేస్తున్నప్పటికీ బాధితుల సొమ్ములు పూర్తిగా రికవరీ కావడం లేదు. ఇంటికి తాళం కప్ప కనపడితే చాలు.. దొంగలు రెచ్చిపోయి ఇంటిలోని విలువైన బంగారం, నగదును అపహరించుకుపోతున్నారు. బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి తలుపులు బార్లా తెరచి దర్శణమిస్తున్నాయి. లోపలికి వెళ్లి చూస్తే సొమ్ము మాయమవుతున్నది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని సంఘటనల్లో దొంగలు వేలి ముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేతికి టవల్ కట్టుకుని తలుపులు, బీరువాలు తెరుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రజలు సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని, దొంగతనాలను అరికట్టడంతో ప్రజలు పోలీసులకు సరైన విధంగా సహకారం అందివ్వడం లేదని పోలీసులు వాపోతున్నారు.
ఫ 49.62 శాతం రికవరీ
వివిధ దొంగతనాల్లో 2025 సంవత్సరంలో 4,11,98.269 రూపాయలు సొమ్మును ప్రజలు పోగొట్టుకున్నారు. ఇందులో 2,04,40,762 రూపాయల సొమ్ములను పోలీసులు నిందితుల వద్ద నుంచి రికవరీ చేశారు. వివిధ దొంగతనాలకు సంబంధించి రికవరీ 49.62 శాతంగా ఉంది. 2024లో రికవరీ శాతం 25.92 శాతం ఉంది. 2024 ఏడాదితో పోల్చితే బాధితులు పోగొట్టుకున్న సొమ్ములు పెరిగాయి. అదే సమయంలో రికవరీ శాతం కూడా పెరిగింది.
ఫ దొంగతనాల నియంత్రణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో కోరారు.
- ఊరెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషనలో తప్పకుండా సమాచారం ఇవ్వాలి. ఇది పెట్రోలింగ్ బృందాలు ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచడానికి సహాయపడుతుంది.
- ఇంటిపై నిఘా ఉంచమని ఇరుగుపొరుగు వారికి చెప్పండి. వారి సెల్ ఫోన నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి. మీ ఇంటికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే మీకు తెలియజేయమని చెప్పండి.
- ఊరెళ్లేటప్పుడు ఇంట్లో డబ్బు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్‌లో భద్రపరచాలి. బీరువా తాళాలను ఇంట్లో పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి.
- ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్‌లో పెట్టవద్దు.
- ఇంటికి తాళం వేసినప్పుడు, ఇంట్లోని ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచడం మంచిది. తాళం బయటకు కనిపించకుండా డోర్ కర్టెన వేయాలి.
- కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను నివారించవచ్చు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలి.
- అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచాలి. అనుమానితుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
- ఇంటిలో మనుషులున్నట్లుగా ద్వారాల వద్ద చెప్పులు ఉంచాలి.
- చీకటి ప్రదేశాలు దొంగలకు అనువుగా ఉంటాయి. కదలికను గుర్తించే సెన్సార్ లైట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
- గేట్లు రాత్రిపూట మూసివేసి ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
- పండుగ సందర్భంగా వచ్చే ఆనలైన షాపింగ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఐడీలు సృష్టించి మోసాలు చేసే సైబర్ నేరగాళ్లపై జాగ్రత్త వహించాలి.
- అవసరం లేకుండా వచ్చే మెసేజ్‌లలోని బ్లూ కలర్ లింకులను ఓపెన చేయవద్దు. లాటరీ తగిలిందని, గిప్ట్ వచ్చిందని, తక్కువ ధరకు వస్తువులు ఇస్తామని వచ్చే సందేశాలను నమ్మవద్దు.
- సైబర్ నేరానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే, గంటలోపు 1930కి ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంది.
- సైబర్ నేరాల ఫిర్యాదు కోసం 1930(జాతీయ హెల్ప్‌లైన), 112, 100ను సంప్రదించాలి.
- ఠీఠీఠీ.ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
- అత్యవసర సమయంలో డయల్ 100కి కాల్ చేయాలి.