ముస్తాబైన శివాలయాలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:30 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి.
కరీంనగర్ కల్చరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం జరిగే వేడుకలకు ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు, పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పాతబజార్ గౌరీశంకరాలయం వద్ద ధర్మ, స్పెషల్, అభిషేక దర్శనాల కోసం వేర్వేరు క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో తాగునీటివసతి, షామియానాలు సిద్ధం చేశారు. శివరాత్రి మరుసటి రోజు వరకు పోలీసు సిబ్బంది సాయం తీసుకోనున్నట్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు సేవలందిస్తారని నిర్వాహకులు తెలిపారు. కమాన్‌రోడ్ రామేశ్వరాలయంలో దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భగత్‌నగర్ భవానీ శంకరాలయం వేడుకలకు సిద్ధమయింది. పెండాల్స్, పరదాలు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆదర్శనగర్ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేయగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అభిషేకాలు కొనసాగనున్నాయి. సాయంత్రం శివపార్వతుల కల్యాణం, రాత్రి పల్లకీసేవ జరుపనున్నారు. శ్రీహరినగర్, వీరాంజనేయ సహిత రామలింగేశ్వరాలయంలో జాతర కొనసాగనుంది. శివపంచాయతనం గల ఆలయాలతోపాటు శైవాలయాలన్నీ లింగోద్భవ కాలం వరకు జనంతో కిటకిటలాడనున్నాయి.