Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:49 AM

సైబర్‌ నేరాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం బాలల భద్రత-డ్రగ్స్‌రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ మహేష్‌ బీ గితేతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్‌, ఇతర సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామని ఓటీపీ, ఇతర వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు. ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్‌ చేస్తే ఫోన్‌ హ్యకింగ్‌ చేస్తారని, మొబైల్‌ ఉపయోగించేటప్పుడు జాగత్త్రలు తీసుకోవాలన్నారు. బాలికలు, కిషోరబాలికలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా హెల్ప్‌లైన్‌లో సంప్రదించాలన్నారు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఎస్పీ మహేష్‌ బిగితే మాట్లాడుతూ సైబర్‌క్రైమ్‌కు గురైతే పోలీసులను సంప్రదించాలన్నారు. జనగణన కోసం ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగులు వస్తారని వారి గుర్తింపు కార్డు, వివరాలు తెలుసుకున్న అనంతరమే అందరు తమ వివరాలు చెప్పాలన్నారు. మహిళలు, యువతుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైన్‌-అలైవ్‌ క్రింద వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో శశికళ, సర్పంచ్‌ గన్నారం వసంతనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ

అనంతగిరి గ్రామసమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బిగితేలు సందర్శించారు. రిజర్వాయర్‌ సామర్థ్యం, ప్రస్తుతం నీటి నిలువ ఎంత ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఎమ్‌సీ చైర్‌పర్సన్‌ ఐరెడ్డి చైతన్యమహేందర్‌, సర్పంచ్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:49 AM