Share News

అప్రమత్తతే శ్రీరామరక్ష..

ABN , Publish Date - Apr 08 , 2026 | 01:33 AM

జిల్లాలో అతివేగం, మద్యం మత్తు, నిద్రమత్తు, రోడ్ల దుస్థితి కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి.

అప్రమత్తతే శ్రీరామరక్ష..

జగిత్యాల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అతివేగం, మద్యం మత్తు, నిద్రమత్తు, రోడ్ల దుస్థితి కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించినా, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు వల్ల వాహనాలపై నియంత్రణ కోల్పోతున్నారు. జిల్లాలో ప్రస్తుత యేడాది ఇప్పటి వరకు 102 రోడ్డు ప్రమాదాల్లో 41మంది మృతిచెందగా 96 మందికి గాయాలయ్యాయి. గత మూడు నెలల్లో జిల్లాలో 105 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు కాగా 9 మంది బాలలు ప్రమాదాల్లో మృతిచెందారు. జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 2,162 డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.

ఫజీవితాలను తారుమారు చేస్తున్న ప్రమాదాలు

ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలది ఒక్కొక్కరికి ఒక్కో కన్నీటి గాథ. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో ఆయా కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఎదిగిన కుమారులు చనిపోయి వారి తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో పలువురు యువకులు మరణిస్తూ తల్లిదండ్రులకు వారసులు లేకుండా చేస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అభం, శుభం తెలియన పక్కవారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఫ కారణాలివే..

జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్య వైఖరితో పాటు మద్యం, నిద్రమత్తు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలకు వ్యతిరేక దిశలో వెళ్లడం, వాహనాల ఓవర్‌ టేక్‌ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపైకి వాహనాలతో నేరుగా దూసుకు రావడం, విందు, శుభకార్యాలకు హాజరై మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ ధరించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఫకనిపించని మార్పు..

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, ఆర్టీసీ శాఖ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లకు ఆరు నెలలకు ఒకసారి డ్రైవింగ్‌ నిబంధనలు, ట్రాఫిక్‌ నిబంధనలను తెలియజేస్తున్నారు. వీటితో పాటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్‌ ధరించేలా వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నా మార్పు కనిపించడం లేదు.

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

-అశోక్‌ కుమార్‌, ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన చోదకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, మద్యం మత్తు, నిద్రమత్తు, మైనర్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించాలి. రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని సందర్భాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. రూ.లక్షల్లో వైద్యానికి వ్యయం చేయాల్సి వస్తోంది. వాహనం నడిపే సమయంలో నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

జిల్లాలో ప్రమాదాలు ఇలా..

--------------------------------------

సంవత్సరం...రోడ్డు ప్రమాదాలు...మృతులు...క్షతగాత్రులు

2023 - 448 - 189 - 462

2024 - 466 - 189 - 436

2025 - 520 - 181 - 507

2026 - 102 - 41 - 96 (ఇప్పటి వరకు)

---------------------------------------------------------------------------------

డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు..

2023 సంవత్సరంలో 5,831

2024 సంవత్సరంలో 7,058

2025 సంవత్సరంలో 9,290

2026 సంవత్సరంలో 2,162 (ఇప్పటి వరకు)

---------------------------------------------------------------------------------

ఇటీవల జరిగిన ప్రమాదాలు..

ఫ ధర్మపురి శివారులో కొద్దిరోజుల క్రితం ఓ లారీ ఆటోను ఓవర్‌టేక్‌ చేయబోయి ఆటోతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. సంఘటనలో ముగ్గురు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు హనుమాన్‌ దీక్షాపరులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఫమేడిపల్లి మండల శివారులో రాత్రి సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆగి ఉన్న లారీ ఢీకొట్టి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇందులో ఒక యువకుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి బాధ వర్ణనాతీతం.

ఫ రాయికల్‌ మండలం సింగరావుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో యువకుడి స్వగ్రామం జగిత్యాల మండలం లింగంపేటలో విషాదం నింపింది.

ఫజగిత్యాల రూరల్‌ మండలం తక్కలపల్లి సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు హనుమాన్‌ దీక్షాపరులకు తీవ్ర గాయాలయ్యాయి.

Updated Date - Apr 08 , 2026 | 01:33 AM