బీసీలదే అగ్రస్థానం..
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:14 AM
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే వివరాలను వెల్లడించగా అందులో జగిత్యాల జిల్లాలో బీసీ జనాభా అగ్రస్థానంలో ఉంది.
జగిత్యాల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే వివరాలను వెల్లడించగా అందులో జగిత్యాల జిల్లాలో బీసీ జనాభా అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో మొత్తం జనాభా 10,19,151 మంది ఉన్నారు. అందులో బీసీలు 7,24,866 మంది ఉండగా మొత్తం జనాభాలో 71.13 శాతం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను 2024 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్థులు, వలసలు, ఇలా కీలక సమాచారం సేకరించారు. సంబంధించిన సమాచారాన్ని గత రెండు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కులాల వారీగా వివరాలను నిర్ణీత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. జిల్లాలో ఉప కులాల వారీగా జనాభా చిత్రం స్పష్టమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో ఏ కులం జనాభా ఎంత ఉందనే గణాంకాలు బహిర్గతమయ్యాయి. సంబంధిత సమాచారం ప్రకారం జిల్లాలో వందలాది కులాలు, ఉప కులాల జనాభా, వాటి శాతం, సామాజిక, ఆర్థిక స్థితి సూచికలు వెల్లడయ్యాయి.
ఫఎస్సీల్లో మాదిగలే మెజారిటీ..
జిల్లాలో ఎస్సీ జనాభాలో మాదిగలే మెజారిటీగా ఉన్నారు. జిల్లాలోని ఎస్సీ జనాభాలో మాదిగలు 89,231 మంది ఉండగా, 50.34 శాతం మాదిగ జనాభా ఉన్నట్లు తేలింది. తర్వాత స్థానం మాల, మాల అయ్యవారు 60,798 మంది ఉండగా, 34.30 శాతం జనాభా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాలసాలె, నేతకాని వారు 7,375 మంది ఉండగా 4.16శాతం జనాభా ఉన్నట్లు తేలింది. గోసంగి కులస్థులు 3,276 మంది ఉండగా 1.85శాతం జనాభా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఎస్సీ ఉపకులాలు 57 ఉన్నాయి. ఇందులో అత్యల్పంగా చంచాల, బావురి, ఎల్గమాల్వర్, ఎల్లమాల్వల్లు, గాసి, హెడ్డి రెల్లి, చంచండి, గోదారి, హోలియా, మాంగ్ గరోడి, సామాగారా, సంబన్, సప్రు, సిండోలు, చిందోలు, యాటాల, వల్లవన్ తదితర ఉప కులాలు ఉన్నాయి.
ఫఎస్టీల్లో లంబాడీలే సింహభాగం..
జిల్లాలో మొత్తం 30,212 ఎస్టీ జనాభా ఉంది. జిల్లా మొత్తం జనాభాలో వీరి శాతం 2.96 శాతం ఉంది. ఎస్టీల్లో సుగాలీలు, లంబాడీ, బంజారా ఉపకులాలకు చెందిన జనాభా 13,753 ఉంది. జిల్లా ఎస్టీ జనాభాలో లంబాడీ, ఇతరులు 45.52 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి స్థానంలో ఎరకుల కులస్థులు 4,275 మంది ఉన్నారు. జిల్లా ఎస్టీ జనాభాలో 15.64 ఉన్నట్లు తేలింది.
ఫబీసీల్లో పద్మశాలీలే అధికం..
జిల్లాలో బీసీల్లో పద్మశాలీలే అధికంగా ఉన్నారు. బీసీ బీ కేటాగిరిలో పద్మశాలీ కులస్థులు 92,156 మంది ఉన్నారు. జిల్లాలోని బీసీ బీ జనాభాలో పద్మశాలీలు 12.71 ఉన్నట్లుగా తేలింది. తదుపరి స్థానంలో గౌడ కులస్థులున్నారు. జిల్లాలో గౌడ కులస్థులు 55,366 మంది ఉండగా 7.64 శాతం జనాభా ఉంది. బీసీ ఈలో షేక్స్ 60,722 మంది ఉన్నారు. వీరి శాతం 8.38గా ప్రభుత్వం ప్రకటించింది. అగ్నికుల క్షత్రియ, వడబలిజ, బెస్త, జాలరి, గంగపుత్ర జనాభా 40,077 మంది ఉన్నారు. బీసీల్లో వీరు 5.53శాతంగా ఉన్నారు. రజక కులస్థులు 36,730 మంది ఉన్నారు. జనాభాలో వీరు 5.07శాతంగా ఉన్నారు.
ఫఓసీల్లో సగానికి పైగా రెడ్డిలే...
జిల్లాలో ఓసీ జనాభాలో రెడ్డిలదే మెజారిటీ స్థానం ఉంది. జిల్లాలో మొత్తం ఓసీలు 86,829 ఉన్నారు. జిల్లా జనాభాలో ఓసీలు 8.52 శాతం ఉన్నట్లుగా తేలింది. జిల్లాలోని ఓసీ జనాభాలో రెడ్డి కులస్థులు 45,159 మంది ఉన్నారు. ఓసీ కులస్థుల్లో రెడ్డిలు 52.01 శాతంగా ఉన్నారు. తర్వాత స్థానంలో కోమటి, వైశ్య, గుప్త, శెట్టి కులస్థులు 14,962 మంది ఉండగా 17.23 శాతం ఉన్నట్లుగా తేలింది. జిల్లాలోని ఓసీల్లో వెల్మలు 8,830 మంది ఉండగా, వీరి శాతం 10.17గా లెక్క తేల్చారు. ముస్లింలు(బీసీ-ఈ కాకుండా) ఉన్న వారి జనాభా 5,760గా ఉంది. ఓసీ జనాభాలో వీరు 6.63 శాతంగా ఉన్నారు.