రణరంగం..
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:53 AM
కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
కరీంనగర్ క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ట్ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి, ఒకరిపై ఒకరు చెప్పులు, కుర్చీలు విసిరేసి, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కార్ఖానాగడ్డ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కోర్టు చౌరస్తా వద్దకు చేరుకున్న తర్వాత కాంగ్రెస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీ కార్యాలయం వైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు.
ఫ పోటాపోటీగా నినాదాలు
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు బండి సంజయ్ (ఎంపీ) కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగి కాంగ్రెస్‌పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లితోపాటు ఇతర నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కొందరు కార్యకర్తలు ఎంపీ కార్యాలయంవైపు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఫ డీసీసీ కార్యాలయ ముట్టడికి బీజేపీ యత్నం
అనంతరం బీజేపీ నాయకులు డీసీసీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందస్తు చర్యగా ఎంపీ కార్యాలయం, డీసీసీ కార్యాలయం, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎంపీ కార్యాలయం వద్ద పరిస్థితిని సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ సమీక్షించారు. అనంతరం బీజేపీ నాయకులు సీపీని కలిసి ఎంపీ కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఫ కాంగ్రెస్‌పార్టీ నాయకులకు గాయాలు....
ఈ ఘటనలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన పలువురు నాయకులకు గాయాలయ్యాయి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ అధ్యక్షుడు మునిగంటి అనిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మెంతుల శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముత్యం శంకర్, గట్టు ప్రశాంత్ తదితరులకు గాయాలుకాగా కరీంనగర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వారిని ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పరామర్శించారు.
ఫ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి..
కరీంనగర్ క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీ రోడ్డులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. నీట్ లీకేజీకి బాధ్యుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఢిల్లీలోవేలాది మంది విద్యార్థులు నిరసన చేపడితే వారిపై కేంద్రం విచక్షణా రహితంగా దాడులు చేశారన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులు ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేస్తే అరెస్టు చేయించారని విమర్శించారు. విద్యార్థి, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడి,్డ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, ఎండీ తాజ్, ముత్యం శంకర్‌గౌడ్, గడ్డం విలాస్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పులి ఆంజనేయులుగౌడ్, కొరివి అరుణ్‌కుమార్, మడుపు మోహన్, వెన్నం రజితరెడ్డి, కల్లపల్లి బాలరాజు, గంట శ్రీనివాస్ కళ్యాణి, చాడగొండ బుచ్చిరెడ్డి, నునావత్ భాస్కర్‌నాయక్, పర్వత మల్లేశం, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, వరాల నర్సింగం తదితరులు పాల్గొన్నారు.