బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:47 AM
అడపడుచులు చిరునవ్వుల మధ్య మారుమోగే చప్పట్లు... వినసొంపుగా గౌరమ్మ అటాపాటలతో బుధవారం బతుకమ్మ పండుగ మొదలు కాబోతోంది. తొమ్మిది రోజుల పాటు సాగే పూల జాతరను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలు అట్టహాసంగా జరపుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాల్లో పెద్దతనం పోషిస్తుంది.
- పూలతోటలుగా సిరిసిల్ల వాకిళ్లు
- నేటినుంచి ఎంగిలి పూల బతుకమ్మ
- జిల్లావ్యాప్తంగా 18న పెద్ద బతుకమ్మ
- వేములవాడలో 16న, రుద్రంగిలో 22న సంబురాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అడపడుచులు చిరునవ్వుల మధ్య మారుమోగే చప్పట్లు... వినసొంపుగా గౌరమ్మ అటాపాటలతో బుధవారం బతుకమ్మ పండుగ మొదలు కాబోతోంది. తొమ్మిది రోజుల పాటు సాగే పూల జాతరను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలు అట్టహాసంగా జరపుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాల్లో పెద్దతనం పోషిస్తుంది. బతుకమ్మ సంబరాలు ప్రతిపల్లె ఆటాపాటతో పులకరించిపోనుంది. బతుకమ్మ అనగానే మహిళల ఆటాపాట గుర్తుకు వస్తుంది. బతుకమ్మ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పులకరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణ పల్లె, పట్టణ వాకిళ్లు పూలతోటగా మారిపోయే వేళ.. తంగేడు పువ్వు ముచ్చట్లు... గునుగు పువ్వు సంబరాల మధ్య ఆడపడుచులు పుట్టింటికి తరలివస్తున్న ఆనందోత్సవం.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... పాడిపంటలను ఉయ్యాలో... చల్లంగా చూడమ్మ ఉయ్యాలో...’ అంటూ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ సంబరాల కంటే ముందు చిన్నారుల బొడ్డెమ్మ ఆటా పాటలు ముగిశాయి. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళల శ్రమజీవన సంస్కృతికి అద్దం పడుతూ మహాలయ అమావాస్య నుంచి చిన్న బతుకమ్మలతో సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల (పెద్ద) బతుకమ్మను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 18న అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. వేములవాడలో 16న, రుద్రంగిలో 22న పెద్ద బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
ఆడపడుచు ఎదురుచూసే సంబురం..
మన వాళ్లకు పండుగలు పబ్బాలు, నోములు, వ్రతాలు, సంవత్సరం పొడవునా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ మాత్రం కుటుంబాన్ని ఆనందోత్సాహాల్లో ముంచుతుంది. తొమ్మిది రోజుల పాటు ఆటాపాటలతో సాగిపోయి దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మతో ముగిసే పండుగ కోసం ఆడపడుచులందరు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తారు.
ప్రకృతి పులకరించే పండుగ..
బతుకమ్మ పండుగ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరువైపులా.. పసుపు పారబోయిసినట్లుగా తంగేడు.. ఏ దిక్కున చూసినా పలకరించే కట్ల పూలు, ప్రతి ఇంటి గడప ముందు కనిపించే మందారాలు, తలుపు సందుల్లో తొంగి చూసే గన్నేరు.. నేలంతా పరుచుకునే గుమ్మడి ఇలా.. తీరొక్క రంగుల పూలతో పడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. బతుకమ్మను ఆదిశక్తిగా పల్లెపల్లెలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడపడుచులు జరుపుకుంటూనే ఉంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద బతుకమ్మను మహిళలు జరుపుకుంటే.. అందుకు ఐదు రోజుల ముందు పిల్లలు బొడ్డెమ్మ పండుగను జరుపుకున్నారు. చిన్నపిల్లలు, యువతులు కలిసి ఒక పీటపైన ఎర్రమట్టితో అంతస్తులుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం అలంకరించి.. దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ... బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతారు. బొడ్డెమ్మ పాటల్లో చందమామను కలుపుతూ... పాడుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. బొడ్డెమ్మ తరువాత వచ్చే అయివాస్య నుంచి మహిళలు బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. ఇలా చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు ధరించి గౌరిదేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద ఆడపడుచులు బతుకమ్మ ఆటాపాట ఆడుతారు. చీకటి పడుతున్న వేళ ఊరి శివారులోని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయాల్లో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. పాడిపంటలను ఉయ్యాలో... సల్లంగా సూడమ్మ ఉయ్యాల్లో... అంటూ సాగిన బతుకమ్మకు శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో... చేయగోరితినమ్మ ఉయ్యాలో... జలజాక్షి పన్నీరు ఉయ్యాలో... జలకంబులాడంగ ఉయ్యాలో... సార పలుకుల పప్పు ఉయ్యాలో... నోరు తేలంబులు ఉయ్యాలో... నీతిరో నికిక ఉయ్యాలో... నిదురబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మా... నిద్రకు నూరేళ్లు... నీకు వెయ్యేళ్లు... పాలిచ్చే తల్లికి వెయ్యేళ్లు... నినుగన్న తల్లికి నిండా వెయ్యేళ్లు అంటూ... పెద్ద బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడ పడుచులు పల్లెంలో తెచ్చిన నీటితో వాయినమ్మ వాయినమ్మ అంటూ వాయినాలు ఇచ్చుకుంటారు.
బతుకమ్మ పేర్చడంలో కళ...
తెలంగాణ వాకిళ్లను పూలతోటగా మార్చిన బతుకమ్మ సంబరాల్లో పెద్ద బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పెద్ద బతుకమ్మ మగవాళ్ల సహకారంతో పేరుస్తారు. మగవాళ్లు అందరు పెద్ద బతుకమ్మ ముస్తాబుకు అవసరమైన రంగులు, పూల సేకరణలో మునిగిపోతారు. సామాజిక సహజీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పెద్ద బతుకమ్మను పేరవడంలోనూ ఒక కళ ఉంటుంది. ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంట్లో పెద్ద వాళ్లు సాన్నాలు చేసి ఒక పీట మీద కూర్చొని ఎదురుగా ఒక కుదురువంటి దాన్ని పెట్టుకొని బతుకమ్మ ఎదుగుదలను బట్టి నిలబడి పూర్తిచేస్తారు. ఒక పెద్ద తాంబాలం తీసుకొని అందులో ఆకుల్ని ముందు పరుస్తారు. నాలుగు వైపులా కట్టడానికి దారాలు వేస్తారు. ముత్తైదువలు పసుపు, కుంకుమలు వేసి కూడా తాంబాల మొదటి వరుసలో తంగేడు పువ్వును పేరుస్తారు. ఆ తరువాత గునుగు పువ్వులను రంగుల్లో ముంచుతూ... పేరుస్తారు. మళ్లీ చివరగా గడ్డి పువ్వులు, చిట్టి చామంతి, పట్టుకుచ్చులపువ్వు, పూతబంతితో అందంగా పేర్చి సాయంత్రం వేళ పట్టుచీరలతో అందంగా తయారైన పడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ... ఆటపాటలతో బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. పెద్ద బతుకమ్మలను మగవాళ్లే నిమజ్జనానికి మోసుకొని వెళ్లడం చేస్తారు.
రోజుకో పేరు.. ఫలహారం...
ప్రపంచంలో ఏ దేశంలోనే ఏ సంస్కృతిలో లేని విధంగా కేవలం తెలంగాణ ఆడపడుచులకు ఆరాధ్యంగా ఉన్న బతుకమ్మను రోజుకో పేరుతో పిలుచుకుంటూ ఫలహారాన్ని సమర్పించుకుంటారు. మాపటేల ఆటపాటలతో రకారకాల ఫలహారాలు బతుకమ్మకు సమర్పించి వాయనాలుగా ఇచ్చి పుచ్చుకుంటారు. పల్లెల బాధలను, గాథలను, మంచి చెడులను తెలియజెప్పే పాటలతో గడిపే మహిళలు గౌరమ్మకు అందించే ఫల హారాలు ఇలా ఉంటాయి..
మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మగా పేరుస్తారు. ఈ రోజు నువ్వులు, బెల్లం, మొక్కజొన్న పేలాలు.
రెండవ రోజు : అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం.
మూడవ రోజు : ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బెల్లం, పాలతో ప్రసాదం.
నాల్గవ రోజు : నానబియ్యం బతుకమ్మ. నానిన బియ్యం, పాలలో నానబెట్టిన బియ్యంపిండితో బెల్లం కలిపి ప్రసాదం చేస్తారు.
ఐదవ రోజు : అట్ల బతుకమ్మ. బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్లు ప్రసాదంగా తీసుకెళ్తారు.
ఆరవ రోజు : అలిగిన బతుకమ్మ. కొన్ని చోట్ల బతుకమ్మను పేర్చడం, ఆడడం చేయరు. ఆ రోజు బతుకమ్మ అలిగిందని అతివలు విశ్వసిస్తారు. ఒకవేళ బతుకమ్మ ఆడినా ప్రసాదం ఏమి చేయరు.
ఏడవ రోజు : వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దలా చేసి నూనెలో వేయించి ప్రసాదం చేస్తారు. పప్పు బెల్లం కూడా తయారు చేస్తారు.
ఎనిమిదవ రోజు : వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న బెల్లం, నెయ్యితో చేసిన ఫలహారం.
తొమ్మిదో రోజు : పెద్ద బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చి ఫలహారాలతో సాగనంపుతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిండి వంటలతో ఉత్సాహంగా గడుపుతారు. రకరకాల పిండి వంటలతో పోటీ పడతారు. ఇంటిల్లి పాది బతుకమ్మను సాగనంపుతారు.
రామనే శ్రీరామ ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
చిన్నలకు వచ్చింది ఉయ్యాలో చిన్న బతుకమ్మ ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద బతుకమ్మ ఉయ్యాలో
బాలలకు తెచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో
తలమీద చంద్రుడా ఉయ్యాలో దండామయ్య నీకు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేల మీదికాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో
తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లాని గుళ్ళు ఉయ్యాలో
పన్నెండేళ్ళ నాడు ఉయ్యాలో పాడు బడ్డ గుడి ఉయ్యాలో
తెల్లని వేములవాడ ఉయ్యాలో రాజన్న గుడి ఉయ్యాలో
నల్లనల్లని గుళ్లు ఉయ్యాలో నల్లని గుళ్ళు ఉయ్యాలో
నల్లని నల్లగొండ ఉయ్యాలో నరసింహులు గుళ్ళు ఉయ్యాలో
పచ్చపచ్చని గుళ్ళు ఉయ్యాలో పచ్చని గుళ్ళు ఉయ్యాలో
పచ్చ పర్వతాలు ఉయ్యాలో మల్లయ్య గుళ్ళు ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదముల సెలవయ్య ఉయ్యాలో
పన్నెండేళ్ళ నాడు ఉయ్యాలో పాడు బడ్డ గుడి ఉయ్యాలో
గుళ్ళువున్న వారు ఉయ్యాలో మీరెవ్వరయ్య ఉయ్యాలో
మేమయ్య పేదరాశి ఉయ్యాలో కోడళ్ళమయ్య ఉయ్యాలో
కోడళ్లు మీరైతే ఉయ్యాలో ఎందుకొచ్చారయ్య ఉయ్యాలో
సంతానం లేదని ఉయ్యాలో కాసులడిగితిమి ఉయ్యాలో
సంతానం మేమీయము ఉయ్యాలో మేమంతాదోరిమి ఉయ్యాలో
ఇచ్చేటోడు ఇస్తాడు ఉయ్యాలో రాసేటి బ్రహ్మ ఉయ్యాలో
సిటీలో ఉన్నారు ఉయ్యాలో నీ చిన్ని బాలలు ఉయ్యాలో
నాచిన్ని బాలలకు ఉయ్యాలో పాలులేవు రాజా ఉయ్యాలో
శుక్రవారం నాడు ఉయ్యాలో పొద్దున లేచి ఉయ్యాలో
ఉయ్యాలో అలుకూత చేసి ఉయ్యాలో
తలస్నానం ఉయ్యాలో ఆమె చేసినది ఉయ్యాలో
గంగాదేవికైతే ఉయ్యాలో పాలకాయ కొడితే ఉయ్యాలో
గంగపారినట్లు ఉయ్యాలో పాలు పారవట్టే ఉయ్యాలో