బేరసారాలు షురూ
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:49 AM
పురపాలక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఉపసంహరణలకు బేరసారాలు మొదలయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర రిజిస్టర్ పార్టీలతో పాటు స్వతంత్రులుగా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
- స్వతంత్ర అభ్యర్థులకు గాలం
- బీఆర్‌ఎస్‌లో రెబల్స్‌కు బుజ్జగింపులు
- కాంగ్రెస్, బీజేపీలో బీఫామ్ జారీకి మల్లగుల్లాలు
- సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో 67 వార్డులు.. బరిలో 391 మంది అభ్యర్థులు
- 3వ తేదీవరకు ఉపసంహరణలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పురపాలక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఉపసంహరణలకు బేరసారాలు మొదలయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర రిజిస్టర్ పార్టీలతో పాటు స్వతంత్రులుగా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా 391 మంది నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అధికారులు పూర్తి చేశారు. ఆర్డీవో వేంకటేశ్వర్లు, కమిషనర్ ఖదీర్ పాష పర్యవేక్షించారు. రెండు మున్సిపాలిటీలో నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదు. ఆదివారం అభ్యంతరాల స్వీకరణ, సోమవారం పరిష్కారం చేస్తారు. 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో నామినేషన్లు వేసిన వారిని తమకు మద్దతుగా ఉపసంహరించడానికి నేతలు మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఎంతో కష్టపడి బరిలో నిలిపిన అభ్యర్థులు ఎక్కడ చేజారిపోతారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులల్లో అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో మూడు ప్రధాన పార్టీల్లో కొన్నివార్డుల్లో రెబల్స్ బరిలో ఉండడంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 240 మంది నామినేషన్లు వేశారు. ఇందులో ప్రధానంగా బీఆర్‌ఎస్ నుంచి టికెట్ వస్తుందనే ఆకాంక్షతో నామినేషన్లు వేసిన వారు ఉన్నారు. వారికి టికెట్ ఖరారు కాకపోవడంతో బరిలో నుంచి తప్పించడానికి ఆపార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వేములవాడలో 28 వార్డులు ఉండగా 151 మంది అభ్యర్థులు నామినేషన వేశారు. కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారిని బుజ్జగించి ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేములవాడలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటాపోటీగా పరిస్థితులు ఉండగా సిరిసిల్లలో మాత్రం బీఆర్‌ఎస్ ఏకపక్షంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకునే విధంగా బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఏకగ్రీవాలు సక్సెస్ కావడంతో ఈసారి కూడా తక్కువ నామినేషన్లు ఉన్న వార్డులో ఏకగ్రీవం వైపు ప్రయత్నాలు చేయడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులను తమకు అనుకూలంగా ఉపసంహరించుకునే విధంగా అభ్యర్థులు కూడా ప్రయత్నాలు చేస్తూ నామినేషన సందర్భంగా చేసిన ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నారు.
- లక్షల్లోనే ఆఫర్
సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో 67 వార్డుల్లో 391 మంది నామినేషన వేశారు. ఇందులో కొన్ని వార్డుల్లో మూడు, నాలుగు నామినేషన్లు వచ్చినవి కూడా ఉన్నాయి. ఇలాంటి వార్డుల్లో లక్షల్లోనే ఆఫర్ చేస్తూ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులు 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డవారు ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తున్న వాటిల్లో తాము ఖర్చు పెట్టే 50 లక్షల రూపాయలు తమకు పోటీగా ఉన్న అభ్యర్థులకు ఇవ్వడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఎవరు చేజారిపోతారో ఏ పార్టీకి లబ్ధిచేకూరుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి కూడా ఉంది. 3వ తేదీ వరకు ఉపసంహరణలు ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
- సిరిసిల్ల మున్సిపాలిటీలో..
సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 240 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒకటో వార్డులో ఆరుగరు అభ్యర్థులు, రెండో వార్డులో, ఏడుగురు, మూడో వార్డులో నలుగురు, నాలుగు, ఐదు, ఆరు వార్డులో ఐదుగురు చొప్పున, ఏడు, ఎనిమిది వార్డుల్లో ఎనిమిది మంది, తొమ్మిదో వార్డులో నలుగురు, 10, 11 వార్డుల్లో ఎనిమిది మంది, 12వ వార్డులో నలుగురు, 13వ వార్డులో ఆరుగురు, 14వ వార్డులో ఏడుగురు, 15వ ఆర్డులో తొమ్మిది, 16 వార్డులో నలుగురు, 17, 18 వార్డులో ఐదుగురు, 19వ వార్డులో నలుగురు, 20వార్డులో పది మంది, 21వ వార్డులో తొమ్మిది, 22వ వార్డులో ఏడుగురు, 23 వ వార్డులో నలుగురు, 24 వవార్డులో పది, 25 వార్డులో ఏడుగురు, 26 వార్డులో 11, 27 వార్డు ఐదుగురు, 28 ముగ్గురు, 29 నలుగురు, 30వార్డులో ఏడుగురు, 31, 32 వార్డుల్లో ఏడుగురు, 33వార్డులో ఆరుగురు, 34 వార్డులో తొమ్మిది, 35 లో నలుగురు, 36లో ముగ్గురు, 37లో ఐదుగురు, 38లో ఆరుగురు, 39వ వార్డులో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 04
- వేములవాడమున్సిపాలిటీలో..
1, 2వ వార్డులో నలుగురు, 3, 4 వార్డుల్లో ఐదుగురు, 5లో ముగ్గురు, 6లో ఐదుగురు, 7లో ఎనిమిది, 8 ఏడుగురు, 9లో ఆరుగురు, 10, 11, 12లో ఆరుగురు, 13లో ఐదుగురు, 14లో ఎనిమిది, 15లో నలుగురు, 16లో ఎనిమిది, 17, 18లో ఆరుగురు, 19లో ఏడుగురు, 20లో ఆరుగురు, 21, 22లో ముగ్గురు, 23లో ఆరుగురు, 24, 25, 26, 27 వార్డుల్లో ఐదుగురు, 28వ వార్డులో నలుగురు అభ్యర్థులు నామనేషన్లు వేశారు.