సామాన్యుడిపై ‘బండ’
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:09 AM
పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తత ప్రభావం రాజన్న సిరిసిల్ల జిల్లాపై కూడా పడింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తత ప్రభావం రాజన్న సిరిసిల్ల జిల్లాపై కూడా పడింది. జిల్లా నుంచి దుబాయ్, ఖతార్, అబుదాబి, షార్జా, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా తదితర ప్రాంతాల్లో అనేకమంది జిల్లాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు, దుబాయిలో బాంబు దాడిలో ఎల్లారెడ్డిపేటకు చెందిన కార్మికుడు గాయపడిన సంఘటన కూడా చోటుచేసుకుంది. దీంతో జిల్లాకు చెందిన వలస కార్మిక కుటుంబాలు ఒకవైపు ఆందోళన చెందుతుండగా, సామాన్య ప్రజలపై యుద్ధ ప్రభావం ధరల భారాన్ని మోపుతోంది. పశ్చిమాసియా దేశాల్లో పేలుతున్న మిస్సైల్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ రూపంలో సామాన్యుల వంటింట్లో కూడా పేలింది. యుద్ధ ప్రభావంతో గ్యాస్. పెట్రోల్. డీజిల్ ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నట్లే మహిళా దినోత్సవ కానుకగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ సామాన్యులకు షాక్ ఇచ్చింది. రోజురోజుకు నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న క్రమంలో పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలను కూడా ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. తాజాగా యుద్ధ ప్రభావంతో సబ్సిడీ సిలిండర్ రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115లకు పెంచింది. యుద్ధతాకిడి వంటింటికి చేరడంతో ఇతర సరుకుల రవాణాపై కూడా భారం పడుతుందని భావిస్తున్నారు.
ఫ ప్రతినెలా రూ.50 లక్షల మేరకు అదనపు భారం
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడనుంది. తాజాగా ఇంధన సంస్థలు అకస్మాత్తుగా గృహ వినియోగ సిలిండర్, వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచడంతో ఆ భారం రాజన్న సిరిసిల్ల జిల్లాపై ప్రతినెల రూ.50లక్షల వరకు పడుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 1.76 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ కనెక్షన్లు 1.06 లక్షలు, హెచ్‌పీ కనెక్షన్లు 40,700, భారత్ 29,300 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 14.2కిలోల సిలిండర్ల ధరపై రూ.60 పెరిగింది. పెరుగుదలకు ముందు రూ.923.50 ఉండగా, రూ.983.50కు పెరిగింది. డెలివరీ బాయ్ చార్జి కలుపుకుంటే రూ.1020కి చేరుతుంది. కమర్షియల్ సిలిండర్ ధర చూస్తే అమ్మో అనే పరిస్థితికి పెరిగింది. కమర్షిల్ సిలిండర్‌పై ఏకంగా రూ.115 పెరిగింది. రూ.2049 ఉన్నా సిలిండర్ ధర రూ 2164కు చేరింది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కనెక్షన్లు 3 వేల వరకు ఉన్నాయి. ఉజ్వల్ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడంతో పేదవర్గాలకు కొంత ఉపశమనం కలిగింది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో సబ్సిడీ సిలిండర్లనే వినియోగిస్తున్నారు.
దిగుమతులపై సందిగ్ధం
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దిమతులపై సందిగ్ధం నెలకొంది. హోర్ముజ్ జలసంది ఇరాన్ మూసివేయడంతో దిగుమతులపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో సామాన్య కుటుంబాలపై గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఉండబోతుందనే ఆందోళన నేపథ్యంలోనే యూరియాపై కూడా ప్రభావం పడుతుంది. గల్ప్‌లోని ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిపై ప్రభావం మొదలైంది. ఖతార్ నుంచి రెండు మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావలసి ఉండగా యుద్ధం కారణంగా ఒకటి ఎంఎంసీడీకి తగ్గించారు. దీంతో 50శాతం యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది. గ్యాస్ కోటా తగ్గితే యూరియా ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో రైతులకు అందించే యూరియా కొరత కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.