Share News

సత్ఫలితాలిస్తున్న బేలింగ్‌...

ABN , Publish Date - May 11 , 2026 | 12:06 AM

హుజూరాబాద్‌ డివిజన్‌లో గతంలో పశుగ్రాసం కోసం మూగ జీవాలు అల్లాడేవి. వర్షాలు సమృద్ధిగా కురియడంతో వరి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.

సత్ఫలితాలిస్తున్న బేలింగ్‌...

హుజూరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ డివిజన్‌లో గతంలో పశుగ్రాసం కోసం మూగ జీవాలు అల్లాడేవి. వర్షాలు సమృద్ధిగా కురియడంతో వరి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. దీంతో పశుగ్రాసం పెరిగింది. ఈ ప్రాంతంలో డెయిరీలు ఎక్కువగా ఉండడంతో రైతులు అత్యధికంగా పశువులు, పాడిపశువులు పోషిస్తున్నారు. సుమారు 50 వేల పాడిపశువులు, 30 వేల ఇతర పశువులు ఉన్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. పశుగ్రాసం వృఽథా అరికట్టేందుకు రైతులు బేలింగ్‌ మిషన్లను కొనుగోలు చేసి పశు గ్రాసాన్ని గడ్డి కట్టలుగా కడుతున్నారు.

ప్రతి ఎకరా వరి పశుగ్రాసాన్ని కుప్పకుప్పలు వేయడం, వాటిని ట్రాక్టర్‌ ద్వారా జారగొట్టి వాము పెట్టేందుకు కూలీలు, ట్రాక్టర్‌కు ఎకరాకు గతంలో 10 వేల రూపాయల వరకు ఖర్చు వచ్చేవి. బేలింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఒక్క గడ్డిపోచ కూడా వృఽథా కాదు. కూలీల అవసరం అసలే ఉండదు. ట్రాక్టర్‌కు బేలింగ్‌ మిషన్‌ జత చేసి పశుగ్రాసాన్ని బేళ్లుగా మారుస్తారు. ఒక గడ్డి కట్ట కడితే 30 రూపాయల ఖర్చు అవుతుంది. ఎకరాకు నాలుగు వేల వరకు ఖర్చు వస్తుంది. పెద్దపెద్ద మళ్లు ఉంటే తొందరగానే పశుగ్రాసాన్ని బేళ్లుగా మార్చవచ్చు. దీంతో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇలా పశుగ్రాసాన్ని బేలింగ్‌ చేయడం వల్ల రైతులు రవాణా చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటుంది. రైతులు పశుగ్రాసం బేలింగ్‌ చేయడం వల్ల గడ్డి చిన్నచిన్న ముక్కలుగా విడిపోవడంతో పశువులు తినేందుకు సులువుగా ఉంటుంది. దీంతో పశువులకు ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.

ఫ ఖర్చు తగ్గింది..

- జి మల్లారెడ్డి, రైతు, ఇప్పల్‌నర్సింగాపూర్‌

నేను నా పొలం కోసిన తర్వాత పశుగ్రాసాన్ని బేలింగ్‌ మిషన్‌ ద్వారా కట్టలు కట్టించాను. ఎకరానికి గడ్డి కుప్పవేసి వాము పెట్టిస్తే తొమ్మిది వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చు వచ్చేది. బేలింగ్‌ మిషన్‌ ద్వారా కట్టలు కట్టించడం వల్ల ఎకరానికి నాలుగు వేల వరకు ఖర్చు వచ్చింది. దీని ద్వారా నాకు ఆరు వేల వరకు ఆదా అయింది. త్వరగా పని పూర్తయింది.

Updated Date - May 11 , 2026 | 12:06 AM