Share News

బల్దియా బడ్జెట్‌ రూ. 312.46 కోట్లు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:07 AM

నగరపాలక సంస్థ అధికారులు రూపొందించిన 2025-26 సవరణ బడ్జెట్‌, 2026-27 సంవత్సరానికి 312.46 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌పై పాలకవర్గ సభ్యులు నామమాత్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.

బల్దియా బడ్జెట్‌ రూ. 312.46 కోట్లు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ అధికారులు రూపొందించిన 2025-26 సవరణ బడ్జెట్‌, 2026-27 సంవత్సరానికి 312.46 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌పై పాలకవర్గ సభ్యులు నామమాత్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేయగా బడ్జెట్‌కు ఆమోదం తెలిపి ఆ వెంటనే సర్వసభ్య సమావేశాన్ని కొనసాగించారు. సమావేశాలకు కలెక్టర్‌ చిత్రా మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరుకాగా కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ రెండు సమావేశాల్లో కార్పొరేటర్లు వారివారి డివిజన్లలోని సమస్యలు ఏకరువు పెడుతూ వాటిని పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, కార్మికులను కేటాయించాలని కోరారు.

ఫ వాడివేడిగా..

బీజేపీకి మేయర్‌ పీఠాన్ని కట్టబెట్టండి వరదలా నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతామని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారని, బడ్జెట్‌లో సంజయ్‌ తెచ్చిన నిధులు కనిపించడం లేదని కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ ప్రశ్నించారు. 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు జోక్యం చేసుకొని కేంద్రం నుంచి కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు బండి సంజయ్‌కుమార్‌ వందల కోట్ల నిధులు తీసుకువచ్చారని అవి కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ తెచ్చింది తాుమేనని, బండి సంజయ్‌కుమార్‌కు ఏమాత్రం సంబంధం లేదనడంతో డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు వాడివేడిగా చర్చ జరిగింది. పలువురు కార్పొరేటర్లు వారి డివిజన్లలోని సమస్యలను ప్రస్తావించారు. చివరకు 11 ఎజెండా అంశాలతోపాటు ఇటీవల రద్దు చేసిన డీఎఫ్‌ఐడీ 50 కోట్ల టెండర్ల పనులను అన్ని డివిజన్లకు పంపిణీ చేస్తూ టేబుల్‌ ఎజెండాలో చేర్చిన అంశంతోపాటు, లీకేజీ లేబర్ల నియామకం, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వేతనాల చెల్లింపులు, అధికారులు వినియోగిస్తున్న వాహనాల అద్దెలు, సెల్‌ఫోన్‌ బిల్లుల వంటి 26 టేబుల్‌ ఎజెండా అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు.

ఫ ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతాం

- మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

నగరంలోని విలీన, శివారు డివిజన్లతోపాటు మొత్తం 66 డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేయడంతో రాష్ట్రంలోనే కరీంనగర్‌ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 312.46 కోట్ల కార్పొరేషన్‌ అంచనా బడ్జెట్‌కు పాలకవర్గసభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. పాలకవర్గసభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంతోపాటు అన్ని డివిజన్ల సమాంతర అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశాము. కౌన్సిల్‌ ఆమోదంతో లైటింగ్‌ నిర్వహణకు లాడార్‌, ప్రతి డివిజన్‌కు ఒక ఆటో రిక్షా ఏర్పాటు, తాగునీటి ఇబ్బందులు రాకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తోపాటు వీధిదీపాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించి జనరల్‌ ఫండ్‌ ద్వారా అభివృద్ధి పనులు చేపడతాము.

ఫ కేంద్రమంత్రి ‘బండి’ చొరవతోనే స్మార్ట్‌ పనులు

- మాజీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017లో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసింది. 2020లో నేను మేయర్‌ అయ్యే వరకుకేవలం 20 కోట్ల పనులు జరిగాయి. కనీసం టెండర్లు కూడా పూర్తికాలేదు.. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ చొరవ తీసుకోవడంతోనే 2020 తర్వాత మా పాలకవర్గంలోనే స్మార్ట్‌సిటీ పనులు పూర్తయ్యాయి. స్మార్ట్‌సిటీ ఇచ్చేముందు కూడా ఆనాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంజయ్‌ని గుర్తు చేశారు.. ఇక ముందు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నగర అభివృద్ధికి కృషిచేస్తాం.

ఫ స్మార్ట్‌సిటీలో సంజయ్‌ ప్రమేయమే లేదు

- మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌

నేను మేయర్‌గా ఉన్నపుడే 2017లో కరీంనగర్‌ స్మార్ట్‌సిటీగా ఎంపికైంది. అప్పుడు బండి సంజయ్‌ ఎంపీ కూడా కాదు.. స్మార్ట్‌సిటీ కోసం కేంద్రమంత్రిని కలిసేందుకు కార్పొరేటర్లందరిని ఢిల్లీకి తీసుకెళ్ళేందుకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తే సంజయ్‌ రాలేదు.. ఎప్పుడూ స్మార్ట్‌సిటీ సమావేశాల్లో పాల్గొనలేదు... స్మార్ట్‌సిటీకి సంజయ్‌కి సంబంధమే లేదు. బడ్జెట్‌ రూపకల్పన సరిగా జరుగలేదు. ఆడిట్‌ రిపోర్టు నివేదించలేదు. బడ్జెట్‌ అంతా అంకెల మార్పిడితోనేచేశారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచేలా బడ్జెట్‌ రూపొందించలేదు..

ఫ బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా ఉంది...

- కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌

నగరపాలక సంస్థ అధికారులు 312.46 కోట్ల అంచనాలతో రూపొందించిన 2026-27 బడ్జెట్‌ పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉంది. గత ఏడాది అంకెలను తారుమారు చేశారే తప్ప కార్పొరేషన్‌కు జనరల్‌ ఫండ్‌ పెంచుకునే ఆదాయమార్గాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటి ఊసెత్తలేదు. గత ఏడాది గ్రాంట్‌ రూపంలో పెద్ద ఎత్తున నిధులు వస్తాయని అంచనా వేశారు. వాటిలో సగం కూడా రాలేదు. పన్నులను లక్ష్యం మేరకు వసూలు చేయలేదు. అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్లు, అక్రమ హోర్డింగ్స్‌ వంటివి క్రమబద్ధీకరిస్తే రెట్టింపు ఆదాయం వచ్చేది.

ఫ అవినీతిపై విచారణ జరిపించాలి

- బండారి వేణు, 51వ డివిజన్‌ కార్పొరేటర్‌

మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు, తీగలవంతెన నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. మానేరు నదిలోని ఇసుక, రాయి, ఎల్‌ఎండీలోని మట్టిని తీసి పోసి వందల కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్నారు. 184 కోట్లతో ప్రారంభించిన తీగెల వంతెన లైట్లు చెడిపోయాయి. రోడ్డుకు ఇప్పటికి మూడుసార్లు మరమ్మత్తు చేసినా పదేపదే దెబ్బతింటోంది. ఈ అంశాలపై విచారణ జరిపించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలి.

ఫ వీధిదీపాలు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించండి :

- బొట్ల శ్యామల, 27వ డివిజన్‌ కార్పొరేటర్‌

మా డివిజన్‌కు 10 హైమాస్ట్‌ లైట్లు మంజూరు చేయండి. రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడంతోపాటు ఇద్దరు పురుష కార్మికులను ఇచ్చి వీధిదీపాలు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించండి. పైపులైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేయించండి.

ఫ పర్యావరణ పరిరక్షణకు ప్రతి సమావేశానికి సైకిల్‌పైనే వస్తా

- ఒంటెల సత్యనారాయణరెడ్డి 24వ డివిజన్‌ కార్పొరేటర్‌

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని ఆరికట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముంది. అందుకే నేను సైకిల్‌పై సమావేశానికి వచ్చాను. ఇకపై ఐదేళ్లపాటు జరిగే బల్దియా సమావేశాలకు ఇలాగే సైకిల్‌పై వస్తాను. రెండో నల్లా కనెక్షన్‌ తీసుకున్న వారు నెలకు 600 రూపాయలు చెల్లించాలని ఆన్‌లైన్‌లో బకాయిలు చూపిస్తున్నాయి. గతంలో నెలకు వంద రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా తీసుకోవాలి. డీమార్ట్‌ రోడు ఆక్రమణలతో కుచించుకుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆక్రమణలను వెంటనే తొలగించాలి.

ఫ ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

- పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్‌, 62వ డివిజన్‌ కార్పొరేటర్‌

ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను, వస్తువులను అమ్ముతున్న దుకాణాల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసిన 14 లక్షల రూపాయలను ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమాలకు వినియోగించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.

ఫ స్మశానవాటికకు అదనపు సిబ్బందిని నియమించాలి

- ఆకుల నందిని ఉదయ్‌, 7వ డివిజన్‌ కార్పొరేటర్‌

మానేరు నదిఒడ్డున ఉన్న హిందూ స్మశానవాటికలో ఒకే ఒక వాచ్‌మెన్‌ ఉండడంతో నిర్వహణ అధ్వానంగా మారింది. అదనపు సిబ్బందిని నియమించాలి. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లేందుకు నెలకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉచితంగా చెత్త సేకరణ చేయడంతోపాటు డివిజన్‌లో కార్మికుల సంఖ్యను పెంచాలి.

Updated Date - Apr 01 , 2026 | 01:07 AM