Share News

బాబోయ్‌ శునకాలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:11 AM

వీధి కుక్కలు వణికిస్తున్నాయి.

బాబోయ్‌ శునకాలు

కోల్‌సిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్న పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకే పరిస్థితి ఏర్ప డింది. ఆడుకుంటున్న పిల్లలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాయి. రామగుండంలో రోజు ఏదో ఒక చోట చిన్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ నెల 6న గోదావరిఖని శివాజీనగర్‌లో 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ కుమారుడు నాలుగేళ్ల తిప్పారపు చార్విక్‌పై వీఽధి కుక్కలు దాడి చేశాయి. ఇంట్లో నుంచి బయటకు రాగా విరుచుకుపడ్డాయి. బుధవారం రాజీవ్‌నగర్‌లో ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి. కొన్ని నెలల క్రితం ముబారక్‌నగర్‌కు చెందిన మూడేళ్ల బాలుడు హైమద్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స చేయించారు. ఇందిరానగర్‌కు చెందిన సహస్ర అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాపూజీనగర్‌లో ప్రసాద్‌ హైదరాబాద్‌లో చికిత్స చేయించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎండలు పెరగడంతో విచక్షణ రహి తంగా విరుచుకుపడుతున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచ రిస్తూ రాత్రిపూట వాహనాలపై వెళ్లే వారిపై సైతం దాడికి పాల్పడు తున్నాయి. ట్యూషన్ల నుంచి పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులపై వెంటపడి కరుస్తున్నాయి.

జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే గత ఏడాది 1600 మంది వీధి కుక్కల దాడికి గురయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకే 1299మంది సిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 270మంది కుక్కకాటుకు చికిత్స చేయించుకోగా ఫిబ్రవరిలో 158మంది కుక్క కాటుకు చికిత్స పొందారు. బహిరంగ ప్రదేశాలు, జనం రద్దీగా ఉంటే ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, బస్టాండ్‌లు, విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్ల వద్ద వీధి కుక్కలు లేకుండా చూడాలని, వాటికి ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌(ఏబీసీ) ఆపరేషన్లు చేసి వాటిని షెల్టర్లకు తరలిం చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కార్యాచరణ రూపొం దించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

నామమాత్రంగా మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు

మున్సిపాలిటీల్లో వీధి కుక్కల గణన చేయాలని, వాటికి ఏబీసీ ఆపరేష న్లు చేసి రెస్ట్‌షెల్టర్‌లో పెట్టాలని మున్సిపల్‌శాఖ ఆదేశాలిచ్చింది. కానీ అందుకు అనుగుణంగా బడ్జెట్‌ మాత్రం మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో కూడా వీధి కుక్కల నియంత్రణ చేయడంపై మున్సిపల్‌ దృష్టి పెట్టడం లేదు.

రామగుండంలో ఏబీసీ సెంటర్‌ మూసివేత

రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మల్కాపూర్‌ ఎస్‌టీపీ వద్ద కొన్ని రోజుల పాటు ఏబీసీ సెంటర్‌ను నిర్వహించారు. ఒక ఏజెన్సీకి స్టెరిలైజేషన్‌ చేసే బాధ్యత అప్పగించారు. ప్రత్యేకంగా క్యాటిల్‌ షెడ్‌, ఆప రేషన్‌ థియేటర్‌ కూడా ఏర్పాటు చేశారు. రామగుండంతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లోని వీధి కుక్కలకు స్టెరిలైజ్‌ చేశారు. బిల్లులు ఇచ్చే విష యంలో వివాదం తలెత్తడంతో సంబంధిత ఏజెన్సీ చేతులెత్తేసింది. చివరికి ఏబీసీ సెంటర్‌లోని ఏసీలు, ఇతర సామగ్రి చోరికి గురయ్యాయి. నగర పాలక సంస్థ వివిధ స్కీముల నుంచి లక్షలాది రూపాయలను ఏబీసీ సెంటర్‌ ఆధునికీకరణ పేర వెచ్చించింది. అయినా కూడా వాటిని నిర్వహించక మూలన పడేశారు.

వీధి కుక్కలను నియంత్రిస్తాం...

అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

రామగుండంతో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతాం. రామగుండంలో ఏబీసీ సెంటర్‌ను నిర్వహించి వీధి కుక్కలను స్టెరిలైజ్‌ చేయించాం. కొన్ని ఇబ్బందులు తలె త్తాయి. మళ్లీ ఈ సమస్యపై దృష్టి పెడుతున్నాం. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నియంత్రణ చర్యలు చేపడుతాం.

Updated Date - Mar 13 , 2026 | 01:11 AM