తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:55 PM
తల్లిపాల ప్రాధాన్యంపై గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తల్లిపాల ప్రాధాన్యంపై గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. కలెక్టరేట్‌లో ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో గర్భిణులు, బాలింతలు, కుటుంబసభ్యులకు తల్లిపాల ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని ప్రతీ ఒక్కరికి తెలుపాలన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి అక్కడి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన సమావేశం ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాధాన్యంపై వివరించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
సుభాష్‌నగర్: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు, కోర్టు కేసులు అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 212 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, డీఆర్వో స్వామి పాల్గొన్నారు.