Share News

మంత్రి ఇంటి ముట్టడికి యత్నం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:07 AM

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు శుక్రవారం కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటి ముట్టడికి యత్నించారు.

మంత్రి ఇంటి ముట్టడికి యత్నం

సుభాష్‌నగర్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు శుక్రవారం కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. దశల వారీగా వచ్చిన వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లా డుతూ ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధ పాలన చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అడుగుతున్నారని, కొత్తగా ఏమీ అడగడం లేదన్నారు. వచ్చే జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదని, ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించడం లేదని, జీతం పెంచడం లేదు కానీ పనిభారం పెరుగుతుందన్నారు. నేటి బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం ఆశా వర్కర్లకు అన్యాయం చేసిందన్నారు. ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ. 18వేలు నిర్ణయించాలని, ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ. 18వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇస్తామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. పారితోషికాలు కొందరికి వేశారని, మిగితా అందరికీ వేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతినెల 1వ తేదీన పారితోషికాలు ఖాతాలో జమచేయాలని, గతంలో జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు వెంటనే చెల్లించాలని, పెండింగ్‌ బిల్లులు వచ్చేంత వరకు సర్వే చేయలేమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌, జిల్లా సహాయకార్యదర్శి పున్నం రవి, ఆశ వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, ఉపాధ్యక్షులు నాగెల్లి పద్మ, సుమలత, ప్రియాంక, సత్యలక్ష్మి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:07 AM