పోలీస్ స్టేషన్‌లో.. దొంగా.. దొంగ..
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:47 AM
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారు(ఇన్నోవా)(టీఎస్ 09 పీఏ 3794)ను సోమవారం రాత్రి 11:45 గంటలకు చోరీకి గురైన ఘటన కలకలం సృష్టించింది.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారు(ఇన్నోవా)(టీఎస్ 09 పీఏ 3794)ను సోమవారం రాత్రి 11:45 గంటలకు చోరీకి గురైన ఘటన కలకలం సృష్టించింది. పోలీసుల వాహనాన్ని స్టేషన్ ఆవరణలో నుంచి అపహరించుకుపోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఉదయం కరీంనగర్ రూరల్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఫిర్యాదుతో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బొమ్మకల్ రజ్వీచెమన్ ప్రాంతానికి చెందిన ఎండీ ఎజాజ్(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం అరెస్టు చూపించి, రాత్రి కోర్టులో హాజరుపరచి జిల్లా జైలుకు తరలించారు.
ఫ కారులోనే ‘కీ’..
కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్‌లో పెట్రోలింగ్ కోసం ఉపయోగించే కారుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. కారు తాళంచెవులు కారు డ్యాష్ బోర్డు లేదా మ్యాట్ కింద భద్రపరుస్తారు. డ్యూటీకి వచ్చిన డ్రైవర్ కారులో దాచిన ‘కీ’తో స్టార్ట్ చేసి వెళుతుంటారు. ఇది సాదరణంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అనుసరించే పద్ధతి. నిందితుడు ఎజాజ్ స్టేషన్‌కు వచ్చి కారులోకి ప్రవేశించిన తరువాత మ్యాట్ కింద ఉన్న‘కీ’ని ఉపయోగించి స్టార్ట్ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కరీంనగర్ రూరల్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లు ఒకే ఆవరణలో ఉండడంతో ఏ స్టేషన్‌కు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారు? అనేది కొంత గందరగోళంగానే ఉంటుంది. సెంట్రీ, గార్డు లేక పోవడంతో కారు చోరీ అయినా తెలియకుండా పోయింది. రెండు రోజుల క్రితం నిందితుడు ఎజాజ్ ఆదివారం డయల్100కు కాల్ చేసి తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేయగా అక్కడికి బ్లూకోల్ట్స్ పోలీసులు వెళ్లి విచారణ జరిపారు. కొద్ది రోజులుగా ఎజాజ్ వింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
ఫ డ్రైవర్ సస్పెన్షన్ ?.....
కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్‌లో పోలీసు పెట్రోలింగ్ కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్‌కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. కరీంనగర్ రూరల్ స్టేషన్‌కు సంబంధించి పెట్రోలింగ్ కారు నడిపేందుకు సోమవారం మరో డ్రైవర్ రావాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో తాళంచెవులను అదే కారులో పెట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకుడ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నది.
ఫ స్టేషన్ సిబ్బందే తీసుకుపోతున్నారని భావించి..
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్‌చేసి ఉన్న పెట్రోలింగ్ కారు(ఇన్నోవా)( టీఎస్ 09 పీఏ 3794)ను సోమవారం రాత్రి 11:45 గంటలకు ఎండీ ఎజాజ్ అపహరించుకుపోయాడు. ఆ సమయంలో స్టేషన్‌లో ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, ఓ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నారు. స్టేషన్ సిబ్బందే పెట్రోలింగ్ కోసం కారును బయటకు తీసుకుపోతున్నారని వారు భావించారు. కారు కార్ఖానగడ్డ ప్రాంతం ద్వారా, కేబుల్ బ్రిడ్జి మార్గంలో వరంగల్‌వైపు వెళ్లింది. కార్ఖనగడ్డ ప్రాంతంలో కొందరు యువకులు గుమిగూడి ఉండగా వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎజాజ్ హెచ్చరించి ముందుకువెళ్లాడు. వారిలో ఓ యువకుడు ఎజాజ్‌ను గుర్తించి కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఫోన్ చేసి తెలిపాడు. అప్పటి వరకు కారు అపహరణకు గురైన విషయం పోలీసులకు తెలియలేదు. ఎజాజ్ కారులో ఉన్న వైర్‌లెస్ సెట్‌ను పడేసి, పోలీసు క్యాప్ ధరించి, ఎల్కతుర్తి వద్ద రోడ్డుపై వాహనాలను తనిఖీ చేశాడు. స్థానిక పోలీసులకు విషయం తెలిసి అక్కడికి రావడంతో కారులో ఎజాజ్ పారిపోయాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఎజాజ్ అక్కడి నుంచి తప్పించకుని ఇంటికి చేరుకున్నాడు.
ఎజాజ్ కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడని అతడి తండ్రి నవాజ్ తెలిపాడు. ఎజాజ్ ప్రేమవివాహం చేసుకున్నాడని, నెల రోజులుగా గొడవలు జరుగుతుండడంతో భార్య, కొడుకును తీసుకుని వెళ్లిపోయిందన్నాడు. అప్పటి నుంచి మతిస్థిమితంలేకుండా ప్రవర్తిస్తున్నాడని తెలిపాడు.