Share News

భవిషత్తుకు భరోసా.. భవిత

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:05 AM

చిన్నతనంలోనే శారీరక, మానసిక లోపాలతో పుట్టిన పిల్లలకు భవిత కేంద్రాలు భరోసా కల్పిస్తున్నాయి

భవిషత్తుకు భరోసా.. భవిత

- దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక శిక్షణ

జమ్మికుంట రూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలోనే శారీరక, మానసిక లోపాలతో పుట్టిన పిల్లలకు భవిత కేంద్రాలు భరోసా కల్పిస్తున్నాయి. మానసికంగా శారీరకంగా నడవలేని స్థితిలో ఉన్న చిన్నారుల కోసం ప్రతి మండలానికి ఒక భవిత కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసింది. వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణులైన ఉపాధ్యాయులను నియమించింది. జమ్మికుంటలో ఉన్న భవిత కేంద్రంలో ప్రస్తుతం 20 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉన్న దివ్యాంగ పిల్లల్లో వారి స్థాయిని బట్టి మార్పు తీసుకువచ్చి విద్యపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం భవిత సెంటర్లో 18 సంవత్సరాలలోపు వారిని చేర్చుకుంటున్నారు. విద్యపై ఆసక్తిని కలిగించేలా వివిధ రకాల ఆట వస్తువులతో బోధనా పరికరాలతో విద్యార్థులకు మెమొరీ పవర్‌ పెంపొందించేలా శిక్షణ అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్ధుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని స్థాయిని పెంచుతూ వారిలో మార్పు వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థులకు వారంలో రెండుసార్లు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేయిస్తున్నారు.

ఫ ప్రయాణ ఖర్చులు ఉచితం..

శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలను భవిత సెంటర్లకు తీసుకురావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. నెల రోజులకు ఒకసారి పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తున్నారు. ఇంటి వద్ద వారు చేపట్టవల్సిన పనులను వివరిస్తారు.

ఫ విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి..

- మొగిలి, శిక్షకుడు

నడవలేని స్థితిలో ఉన్న అభి అనే విద్యార్థిని తల్లిదండ్రులు భవిత కేంద్రంలో చేర్పించారు. ఆ విద్యార్థికి ఫిజియోథెరపిస్ట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి నడిచే స్థితికి తీసుకువచ్చాము. పాఠశాలలో చదువుకున్న ఓ విద్యార్ధి పదోతరగతి పరీక్షలు కూడా రాశాడు. భవిత కేంద్రానికి వచ్చిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి ఆలన పాలనా చూసుకునేందుకు ఆయాను ఏర్పాటు చేశాం. విద్యార్థుల తల్లిదండ్రులు సహాయ సహకారాలు ఆందజేయాలి.

Updated Date - Jul 15 , 2026 | 01:06 AM