వృద్ధులు, దివ్యాంగులకు ఉపకరణాలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:55 PM
అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సహాయ ఉపకరణాలు అందేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
సైదాపూర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సహాయ ఉపకరణాలు అందేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సైదాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజక వర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్ధారణ క్యాంప్ ద్వారా దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. అర్హులను గ్రామాల నుంచి శిబిరాలకు తీసుకవచ్చి పరీక్షల అనంతరం తిరిగి గ్రామలకు చేర్చే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్నారు. సైదాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానని, అధి అధికారుల వద్ద పరిశీలనలో ఉందన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ చిత్రా మిశ్రాను మంత్రి ఆదేశించారు.
కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ చేయూత పథకం లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. లబ్ధిదారులకు కౌంటర్ల వద్ద అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో అధ్యక్షులు కొత్త తిరుపతిరెడ్డి, పంతంగి రవిందర్, సర్పంచ్ మునిపాల సునీత రవిందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చాడ కొండల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.